Breaking News

యూపీలో అమానుషం.. ఇంటికి నిప్పంటించి జర్నలిస్ట్‌ హత్య


ఇటీవల దేశంలోని జర్నలిస్ట్‌లపై దాడి చేసిన ఘటనలు తరుచూ చోటుచేసుకుంటున్నాయి. కొద్ది రోజుల కిందట తమిళనాడులో ఓ తెలుగు జర్నలిస్ట్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన మరచిపోక ముందే ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు ఇంటికి నిప్పంటించి ఓ జర్నలిస్టును సజీవ దహనం చేసిన ఘటన యూపీలోని బలరాంపూర్ పట్టణంలో వెలుగుచూసింది. స్థానిక జర్నలిస్ట్ రాకేష్ సింగ్ తన స్నేహితుడు పింటు సాహుతో కలిసి ఇంట్లో సమయంలో ఆగంతకులు ఇంటికి నిప్పంటించారు. దీంతో రాకేష్ సింగ్‌తో పాటు అతని స్నేహితుడిని సజీవదహనమయ్యారు. శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా.. ఆసమయంలో జర్నలిస్ట్ భార్య, పిల్లలు వారి బంధువుల ఇంట్లో ఉన్నారు. వారు ఉంటోన్న ఇంటికి బయట నుంచి గడియపెట్టిన దుండగులు.. అనంతరం నిప్పటించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రాకేశ్, పింటులను హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే పింటు చనిపోయాడు. రాకేశ్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని లక్నోకు తరలిస్తుండగానే మృతిచెందాడు. ఓ గదిలో మంటలు అంటుకోవడంతో పైకప్పు కూలింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనను హత్యగానే పరిగణిస్తున్నామని బలరాంపూర్ ఎస్పీ రంజన్ వర్మ తెలిపారు. మరణించిన జర్నలిస్ట్ కుటుంబానికి రూ.5లక్షల పరిహారం అందజేశారు. మృతుడి భార్య విభా సింగ్‌కు బలరాంపూర్ షుగర్ మిల్లులో ఉద్యోగం ఇస్తామని అధికారులు ప్రకటించారు. జర్నలిస్ట్‌ను సజీవ దహనం ఎవరు చేశారు? ఎందుకు చేశారనే విషయంపై దర్యాప్తునకు నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని ఎస్పీ వెల్లడించారు. విభా సింగ్ మాట్లాడుతూ.. అత్యంత వేగంగా కేసు దర్యాప్తు పూర్తిచేసి నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, పోలీసులపై తమకు నమ్మకం లేదని, నిందితులను అరెస్ట్ చేయకపోతే తమ కుటుంబానికి వారి నుంచి ముప్పు ఉంటుందని అన్నారు. ‘స్థానిక దినపత్రికలో ఉద్యోగం చేస్తున్న జర్నలిస్ట్ రాకేశ్ సింగ్.. అతడి స్నేహితుడితో కలిసి ఇంట్లో ఉన్నప్పుడు మంటలు చెలరేగి చనిపోయారు.. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని, ఫోరెన్సిక్ సాయం తీసుకున్నామని’ ఎస్పీ వెల్లడించారు. బాధితులు ఇచ్చిన సమాచారం మేరకు ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు తెలిపారు.


By November 30, 2020 at 07:37AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/journalist-and-his-friend-killed-after-house-set-afire-in-uttar-pradesh/articleshow/79483505.cms

No comments