అమ్మా దిశ.. ఇవన్నీ నీవల్లే తల్లీ!
అది ఖైరతాబాద్ బ్రిడ్జి. సమయం సుమారు రాత్రి 8 గంటలు. ఆ వంతెనపై ఓ చోట కొంత మంది తమ వాహనాలను పక్కన నిలిపేసి ఓ జంటను ఏదో ప్రశ్నిస్తున్నారు. వారి మధ్య ఘర్షణ జరుగుతున్నట్లు అనిపించింది. బైక్ స్లో చేసి గమనించగా.. ఓ మహిళపై ఓ వ్యక్తి దాడి చేస్తూ, చేయి పట్టి లాగుతూ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాడు. ఇద్దరి మధ్య పెనుగులాట జరుగుతోంది. అది చూడటానికి కాస్త అభ్యంతరకరంగానే ఉంది. బైకులపై ఉన్న వారు సమస్య ఏంటని ఆ మహిళను ప్రశ్నించారు. దానికి ఆమె హిందీలో ఏదో సమాధానం చెప్పింది. మొత్తానికి అది భార్యాభర్తల గొడవ అని మాత్రం అర్థమైంది. వారిలో ఓ వ్యక్తి అతడికి ఆ మహిళను అలా పబ్లిగ్గా కొట్టొద్దని, మాట్లాడి సమస్య పరిష్కరించుకోవాలని నాలుగు మంచి మాటలు చెప్పి బైక్ స్టార్ట్ చేసుకొని వెళ్లిపోయాడు. ఆ తర్వాత మిగిలిన వారు కూడా అక్కడ నుంచి మెల్లిగా వెళ్లిపోయారు. కొన్ని రోజుల కిందట హైదరాబాద్‌లో జరిగిన సంఘటన ఇది. మామూలుగా అయితే.. దీనికి పెద్దగా ప్రాధాన్యం లేదు. కానీ, ఒంటరిగా రోడ్డుపై ఉన్న మహిళ క్షేమ సమాచారం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయడం కాస్త మనసుకు తాకింది. సాధారణంగా రోడ్డుపై అలాంటివి ఏం జరిగినా పట్టించుకోకుండా తమ దారిన తాము వెళ్లిపోయే జనం.. ఆ రాత్రి వేళ మహిళకు సాయపడటానికి ముందుకురావడం ఆలోచింపజేసింది. ఏడాది కిందట శంషాబాద్‌లోని ఓ టోల్ ప్లాజా వద్ద జరిగిన ఓ భయానక సంఘటన గుర్తొచ్చింది. అవును అదే.. యావత్ దేశాన్ని కుదేపిసిన విషాదం. ‘దిశ’ ఘటన.. మానవతావాదులను దిగ్భ్రాంతికి గురి చేసిన, గుండెల్ని పిండేసిన దారుణం. ఆ ఘటన ప్రభావమే తాజా మార్పు కావొచ్చని అనిపిస్తోంది. ఇదొక్కటే కాదు. ఏడాది కాలంగా ఎన్నో జరిగాయి. చట్టాలు కఠినతరమయ్యాయి. అనేక కేసుల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వచ్చాయి. ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం చట్టం చేసింది. దిశ పోలీస్ స్టేషన్లు వచ్చాయి. హైదరాబాద్‌తో పాటు పలు నగరాలు, పట్టణాల్లో రాత్రి పూట గస్తీ పెరిగింది. శివార్లలో నిఘా పెరిగింది. గస్తీ వాహనాలు రెట్టింపయ్యాయి. డయల్ 100 గురించి జనానికి, ముఖ్యంగా మహిళలకు అవగాహన పెరిగింది. ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే పోలీసులకు ఫోన్ చేయాలనే స్పృహ వచ్చింది. అందుకోసం ప్రత్యేక మొబైల్ యాప్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి. మహిళల భద్రత కోసం పనిచేసే పోలీసు విభాగాలు పెరిగాయి. దిశ ఘటనకు ముందు వరంగల్‌లో తొమ్మిది నెలల చిన్నారిని అత్యాచారం చేసి, హత్య చేసిన కేసులో వేగంగా విచారణ జరిగి నిందితుడికి శిక్ష పడింది. ఆసిఫాబాద్‌లో ‘సమత’ దారుణ అత్యాచారం, హత్య కేసు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వేగంగా విచారణ జరిగింది. హాజీపూర్ అమ్మాయిల వరుస హత్యల కేసులో వేగంగా విచారణ పూర్తై నిందితుడికి శిక్ష పడింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అన్నింటి కంటే ప్రధానంగా.. ఆరుబయటకు వెళ్లిన తమ ఆడబిడ్డలు ఇంటికి రావడం కాస్త ఆలస్యమైతే, ఏం జరిగిందని తల్లిదండ్రులు ఆరా తీస్తున్నారు. రాత్రి పూట వాళ్లు బయటకి వెళ్లాల్సి వస్తే తోడుగా ఎవరినైనా పంపించడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. యుక్త వయసుకు వచ్చిన అమ్మాయిలకు జాగ్రత్తలు చెబుతున్నారు. కిడ్నాప్, అదృశ్యం లాంటి ఘటనలు జరిగితే పోలీసులు వేగంగా స్పందిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఓ డాక్టర్‌ను, మహబూబ్‌నగర్‌లో ఓ చిన్నారిని కిడ్నాపర్ల చెర నుంచి గంటల వ్యవధిలోనే విడిపించారు. అన్నింటికంటే ముఖ్యంగా.. ఆడబిడ్డలపై దారుణాలకు ఒడిగడితే ఎన్‌కౌంటర్లు జరగవచ్చనే సంకేతం ఇచ్చారు. ఇవన్నీ దిశ తీసుకొచ్చిన మార్పులే. ఆమె వీటిని ఊహించకపోయినా, ఇవన్నీ ఆమెకు తెలియకుండానే జరిగినా.. ఈ సమాజం మాత్రం ఆమెకు రుణపడాల్సిందే. తల్లీ ఏ లోకంలో ఉన్నావో గానీ.. ఎంతో మంది బిడ్డలను రక్షించావు, రక్షిస్తూనే ఉన్నావు. ఆ కాళరాత్రి ఎంత నరకం అనుభవించావో.. 2019 నవంబర్ 29. చలికాలం.. రాత్రి 9 గంటల సమయం. నగరం అప్పుడే నిద్ర పోవడానికి సిద్ధమవుతోంది. బ్యూటీ పార్లర్ పని మీద గచ్చిబౌలి వెళ్లిన యువ వెటర్నరీ డాక్టర్.. తొండుపల్లి టోల్ ప్లాజా వద్దకు తిరిగొచ్చారు. అప్పటికే అక్కడ కాచుక్కూర్చున్న మానవ మృగాలు ఆమె కోసం తోడేళ్లలా ఎదురుచూస్తున్నాయి. ఆమె స్కూటీ పార్క్ చేసి వెళ్లిపోవడాన్ని గమనించిన నలుగురు దుర్మార్గులు దురుద్దేశంతో టైర్ పంక్షర్ చేసి కపట నాటకం ఆడారు. సాయం చేస్తామని నమ్మించి మోసం చేశారు. అప్పటికే ఫూటుగా తాగి ఉన్న ఆ లారీ డ్రైవర్లు, క్లీనర్లు ఆమెను బలవంతంగా పక్కకు తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆ తర్వాత ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. బిజీగా ఉండే హైవేపై, టోల్ ప్లాజాకు కూతవేటు దూరంలోనే ఈ దారుణం జరిగింది. ఆ కాళరాత్రి ఆమె చేసిన ఆర్తనాదాలు అరణ్య రోదనగానే మిగిలాయి. ఒంటరిగా ఇబ్బంది పడుతున్న ఆమెను.. ఆ దారెంట వెళ్తున్న ఏ ఒక్కరు గమనించి ఆరా తీసినా.. పరిస్థితి మరోలా ఉండేదేమో. అర్ధరాత్రి మృగాళ్ల చేతిలో చిధ్రమై, పెట్రోలు మంటల్లో గుర్తుపట్టరానివిధంగా కాలి ఉండకపోయేదేమో. ఆడపిల్లలున్న తలిదండ్రులు గుండెలు జారిపోయేలా చేసిన ఘటన అది. అలాంటి కష్టం మళ్లీ ఏ ఆడపిల్లకూ రావొద్దు.. Also Read: ★ ★ ★
By November 27, 2020 at 04:51AM
No comments