Breaking News

భారత్, అమెరికా సహా పలు దేశాల టీకా ప్రయోగాలపై రష్యా, ఉత్తర కొరియా హాకర్ల కన్ను


ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని అంతం చేసే బ్రహ్మాస్త్రం వంటి వ్యాక్సిన్ కోసం శాస్త్రవేత్తలు, పరిశోధకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, ఈ ప్రయోగాల సమాచారాన్ని తస్కరించేందుకు హ్యాకర్ల ప్రయత్నిస్తున్నారు. ప్రముఖ ఫార్మా కంపెనీలు, వ్యాక్సిన్‌ పరిశోధకుల నుంచి విలువైన సమాచారాన్ని చోరీ చేసేందుకు రష్యా, ఉత్తర కొరియా హ్యాకర్లు ప్రయత్నించినట్లు మైక్రోసాఫ్ట్‌ వెల్లడించింది. ఈ మేరకు ఆ సంస్థ తన బ్లాగులో తెలియజేసింది. భారత్‌, కెనడా, దక్షిణ కొరియా, అమెరికా, ఫ్రాన్స్‌లోని కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగాలను లక్ష్యంగా చేసుకున్న హ్యాకర్లు.. సమాచారాన్ని దొంగిలించేందుకు యత్నించినట్లు మైక్రోసాఫ్ట్‌ వెల్లడించింది. అయితే, ఈ ప్రయత్నాలు హ్యాకర్లు చాలా వరకు విఫలమైనట్లు తాము గుర్తించామని స్పష్టం చేసింది. కానీ, ఎంతమంది హ్యాకర్లు డేటా చోరీకి పాల్పడ్డారో, వారు ఎంత ప్రమాదకరమనేది తమ వద్ద ఎటువంటి సమాచారం లేదని పేర్కొంది. రష్యా మిలిటరీ ఏజెంట్స్‌కు చెందిన ఫ్యాన్సీ బీర్‌, ఉత్తర కొరియాకు చెందిన లజారస్‌ గ్రూప్‌ వంటి సంస్థలు హ్యాకింగ్‌కు యత్నించినట్లు మైక్రోసాఫ్ట్‌ వెల్లడించింది. ఫార్మా కంపెనీలు, వ్యాక్సిన్‌ పరిశోధకులు లాగిన్‌ వివరాలను చోరీ చేసేందుకు ప్రయత్నాలు జరిగినట్లు తెలిపింది. హ్యాకర్లు దాడిచేసిన టీకా ప్రయోగ సంస్థలను గుర్తించామని చెప్పింది కానీ, వాటి వివరాలను వెల్లడించడానికి నిరాకరించింది. ఈ రకమైన సైబర్ దాడులు అంగీకారయోగ్యం కాదని, సభ్యసమాజం దీనిని తీవ్రంగా ఖండించాలని కస్టమర్ సెక్యూరిటీ అండ్ ట్రస్ట్ చీఫ్ టామ్ బర్ట్ అన్నారు. ఉత్తర కొరియాకు చెందిన లజారస్ 2016లో సోనీపై, 2017లో వానాక్రై ర్యాన్‌సమ్‌వేర్ దాడికి పాల్పడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులమంటూ తప్పుడు ఈ-మెయిల్స్ పంపి సమాచారాన్ని తస్కరించడానికి ప్రయత్నించినట్టు మైక్రోసాఫ్ట్ పేర్కొంది. పరిశోధన సమాచారం చోరీకి సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తున్నారని అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ, ఎఫ్‌బీఐ ఈ ఏడాది ఆరంభంలో హెచ్చరించిన విషయం తెలిసిందే. కరోనా సమయంలో సైబర్ నేరగాళ్లు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నారని, మరింత అప్రమత్తంగా ఉండాలని పారిస్ పీస్ ఫోరమ్ సమావేశంలో మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్ హెచ్చరించారు. ‘అంతర్జాతీయ చట్టం ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను పరిరక్షిస్తుందని, చట్టాన్ని అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని మైక్రోసాఫ్ట్ ప్రపంచ నేతలకు పిలుపుస్తోంది’ అన్నారు.


By November 14, 2020 at 01:50PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/microsoft-warns-russia-and-north-korea-hackers-targeted-covid-19-vaccine-makers/articleshow/79221919.cms

No comments