Breaking News

అమెరికా: ఫలితాల తర్వాత అల్లర్ల భయం.. షాపులు, వ్యాపార సంస్థలకు ప్లైవుడ్‌తో రక్షణ


అమెరికా చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికల్లో భారీగా ఓటింగ్ నమోదయ్యింది. కరోనా వైరస్ భయపెడుతున్నా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి ఓపికతో ఓటేశారు. ఇదిలా ఉండగా ఫలితాలు వెలువడిన వెంటనే హింస చెలరేగనుందా!? అంటే ‘ఔను’ అనే అంటున్నాయి అమెరికా నిఘా వర్గాలు. అమెరికన్లలోనూ ఇవే ఆందోళన నెలకుంది. ఒకవేళ అల్లర్లు జరిగితే లూటీలు జరగవచ్చన్న భయం ప్రతి ఒక్కరినీ వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ప్రపంచ ఆర్ధిక రాజధాని నగరం న్యూయార్క్‌ నుంచి వాషింగ్టన్‌ వరకూ; చికాగో నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో వరకూ వ్యాపార సంస్థలన్నీ రక్షణ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్‌‌‌ పట్ల అత్యంత కర్కశకంగా వ్యవహరించిన పోలీసులు.. అతడి మరణానికి కారణం కావడంతో దీనిని నిరసిస్తూ అమెరికా అంతటా అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనూ ఆందోళనకారులు షాపులను లూటీ చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మళ్లీ అల్లర్లు చెలరేగితే, షాపుల్లోకి చొచ్చుకొచ్చి లూటీలకు పాల్పడే వీల్లేకుండా ప్లైవుడ్‌, ఇతర చెక్కలతో రక్షణ కల్పిస్తున్నాయి. అలాగే, వైట్‌హౌస్‌తోపాటు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రముఖ వ్యాపార సంస్థల వద్ద భద్రతను పటిష్ఠం చేశారు. శ్వేతసౌధం చుట్టూ సీక్రెట్‌ సర్వీస్‌ ఏకంగా పది అడుగుల ఎత్తున ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసింది. జాతీయ సెక్యూర్టీ గార్డులు రంగంలోకి దిగారు. ఇదిలా ఉండగా.. ఎన్నికల సంబంధ ఆందోళనలు, అల్లర్ల విషయంలో అప్రమత్తంగా ఉన్నట్టు చికాగో మేయర్ లోరీ లైట్‌ఫుట్ అన్నారు. భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయని మనకందరికీ తెలుసు.. ఎందుకంటే ఇప్పటికే అవి ఉన్నాయన్నారు. అయితే, ఈ విషయంలో మీడియా సంయమనం పాటించాలని, పరిస్థితులు శాంతి సామరస్యంగా ఉండేలా తమ వంతు ప్రయత్నం చేయాలని లోరీ పిలుపునిచ్చారు. ఇతర నగరాల మాదిరిగానే చికాగోలోనూ ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. పోలీసు అధికారులకు సెలవులు రద్దు చేసి, సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రదర్శనకారులను నిరోధించడానికి డంపింగ్ ట్రక్కులు, ఇతర భారీ వాహనాలతో వీధులను బ్లాక్ చేస్తున్నారు. శాంతియుతంగా నిరసన తెలపడం ప్రజల హక్కుగా గౌరవిస్తామని, ఘర్షణలను పెంచడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చికాగో ఎస్పీ డేవిడ్ బ్రౌన్ అన్నారు.


By November 04, 2020 at 10:00AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-elections-cities-and-businesses-prepare-for-post-election-unrest-violence/articleshow/79034236.cms

No comments