Breaking News

కాల్పుల ఉల్లంఘనపై భారత్ తీవ్ర నిరసన.. పాక్ హైకమిషన్‌కు సమన్లు


సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి నియంత్రణ రేఖ వెంబడి జరిపిన కాల్పుల్లో ఐదుగురు జవాన్లు సహా 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. పాక్ దురాగతానికి ప్రతీకారం తీర్చుకున్న భారత్.. వారి సైనిక స్థావరాలు, బంకర్లపై విరుచుకుపడింది. ఈ ఘటనపై పాక్ చర్యలపై భారత్ తీవ్ర నిరసన తెలియజేసింది. పాక్ హై కమిషన్‌ను పిలిపించిన విదేశాంగ శాఖ.. దేశమంతా దీపావళి పండుగ సందడిలో ఉండగా అశాంతి, అలజడి సృష్టించే ప్రయత్నం చేశారని మండిపడింది. జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడి హింసకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అమాయక పౌరులే లక్ష్యంగా చేసుకుని పాక్ సైన్యం జరిపిన కాల్పులను భారత్ తీవ్రంగా ఖండిస్తోందని ఈ మేరకు విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ‘నవంబరు 13న ఎల్ఓసీ వెంబడి పలు చోట్ల ఒప్పందాన్ని ఉల్లంఘించి పాకిస్థాన్ సైన్యం కాల్పులకు తెగబడింది.. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ పాక్ హై కమిషన్‌కు సమన్లు జారీచేసి నిరసన తెలియజేశాం.. పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో నలుగురు అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోగా.. 19 మంది గాయపడ్డారు.. భారత్‌లోకి నిరంతరం ఉగ్రవాదుల చొరబాటుకు పాక్ మద్దతు ఇస్తోంది.. పాక్ సైన్యం కాల్పుల ద్వారా కవ్వింపు చర్యలకు పాల్పడి ఇండియన్ ఆర్మీ దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తోంది’ అని భారత్ పేర్కొంది. పాక్ తన నియంత్రణలో ఉన్న ఏ భూభాగం నుంచైనా భారత్‌లోకి ఏ విధంగా ఉగ్రవాదులను ఎగదోయరాదనే ద్వైపాక్షిక ఒప్పందానికి కట్టుబడి ఉండాలని ఇండియా మరోసారి గుర్తుచేసింది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ను భారత్ గతేడాది ఆగస్టులో రద్దు చేసినప్పటి నుంచి పాకిస్థాన్ ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. గత 17ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 4,200కిపైగా కాల్పులు ఉల్లంఘనకు తెగబడింది.


By November 15, 2020 at 09:23AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-summons-pakistan-high-commission-over-ceasefire-violations-in-jammu-and-kashmir/articleshow/79229008.cms

No comments