లాలూ ఆడియో టేపుల వ్యవహారం.. విచారణకు ఝార్ఖండ్ ప్రభుత్వం ఆదేశం
బిహార్‌లో ఆడియో టేపుల వ్యవహారం కలకలం రేపుతోంది. నితీశ్ కుమార్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఆర్జేడీ చీఫ్ ప్రయత్నిస్తున్నారంటూ ఆయన మాట్లాడినట్టు ఓ ఆడియోను బీజేపీ సీనియర్ నేత విడుదల చేసిన విషయం తెలిసిందే. దాణా కుంభకోణం కేసులో ప్రస్తుతం లాలూ రాంచీ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించిన ఝార్ఖండ్ ప్రభుత్వం.. విచారణకు ఆదేశించింది. దీనిపై జైళ్ల శాఖ ఐజీ వీరేంద్ర భూషణ్ పీటీఐతో మాట్లాడుతూ.. రాంచీ డిప్యూటీ కమిషనర్, ఎస్పీ, బిర్సా ముండా జైలు సూపరింటిండెంట్‌ను ఈ అంశంపై విచారణ జరిపి, ఒకవేళ అవి నిజమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు. లాలూ ప్రసాద్, ఎమ్మెల్యే మధ్య సంభాషణ ఆడియో క్లిప్ విన్న తర్వాత విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తులు మొబైల్ ఫోన్ వినియోగానికి నిబంధనలు అంగీకరించవని అన్నారు. ఒకవేళ ఆ ఆరోపణలు నిరూపణ అయితే లాలూకు ఫోన్ ఎలా వచ్చిందో విచారణ జరుపుతామని అన్నారు. అంతేకాదు, జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తులకు రాజకీయ సంభాషణలకు అవకాశం లేదని అన్నారు. అనారోగ్యంతో రిమ్స్‌లో చేరిన లాలూ ప్రసాద్ యాదవ్.. కలెక్టర్ అనుమతితో ప్రస్తుతం రిమ్స్ డైరెక్టర్ బంగ్లాను వినియోగిస్తున్నారన్నారు. లాలూ ప్రసాద్‌ను కలవడానికి వచ్చే వ్యక్తులు, దానితో సంబంధం ఉన్న ఇతర సమస్యల గురించి రాంచీ జిల్లా పాలనా విభాగం నిర్ణయం తీసుకోనుంది. ఆయన అనారోగ్యాన్ని పరిశీలించి జైలుకు పంపించాలని కోరుతూ జార్ఖండ్ హైకోర్టులో ఇప్పటికే ఓ పిల్ దాఖలయ్యింది. సుశీల్ మోదీ విడుదల చేసిన 30 నిమిషాల ఆడియో క్లిప్పింగ్‌లో పిర్పాయింట్ ఎమ్మెల్యే లాలన్ పాశ్వాన్‌తో లాలూ సంభాషించినట్టు పేర్కొన్నారు. నితీశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఓటేయాలని, తమకు మద్దతు ఇస్తే మంత్రి పదవి ఇస్తానని చెబుతున్నట్టు అందులో ఉంది. తమ ఎమ్మెల్యేకు వచ్చిన ఫోన్ నెంబరుకు తానూ కాల్ చేస్తే లాలూ సమాధానం ఇచ్చారని సుశీల్ ఆరోపించారు.
By November 26, 2020 at 01:08PM
No comments