BJP నేత బండి సంజయ్‌పై నెటిజన్ల ఆగ్రహం.. ట్రోల్ చేస్తున్న టీఆర్ఎస్ శ్రేణులు
దుబ్బాక ఉపఎన్నికలో గెలిచిన ఊపు మీదున్న బీజేపీ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఎలాగైనా గెలవాలనే కసితో ఉంది. టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు.. ప్రజలను ఆకట్టుకోవడం కోసం హామీలను గుప్పిస్తోంది. గురువారం మధ్యాహ్యం మీడియాతో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రజలకు రెండు హామీలు ఇచ్చారు. తమ పార్టీ మేయర్ పీఠాన్ని సొంతం చేసుకుంటే.. హైదరాబాద్‌లోని వరద బాధితులకు ఇంటింటికి రూ.25 వేలు చొప్పున ఇస్తామన్నారు. నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందజేస్తామన్నారు. హైదరాబాద్‌లో యువత ట్రిపుల్ రైడింగ్ చేస్తే ట్రాఫిక్ చలాన్లు విధిస్తున్నారన్న సంజయ్.. తాము గెలిస్తే ఈ చలాన్లు మొత్తం జీహెచ్ఎంసీనే కడుతుందన్నారు. ఈ వ్యాఖ్యల పట్ల నెటిజన్లు, టీఆర్ఎస్ అభిమానులు మండిపడుతున్నారు. ఓట్ల కోసం యువతను చెడగొట్టేలా హామీలు ఇవ్వొద్దని సంజయ్‌కు హితవు పలుకుతున్నారు. ట్రిపుల్ రైడింగ్‌కు అనుమతి ఇస్తే... మరి కేంద్రం మోటార్ వెహికల్ చట్టం 2019ను ఎందుకు తీసుకొచ్చింది అని ప్రశ్నిస్తున్నారు. ఇలా చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువవుతాయని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘బండి సంజయ్ ముందు మీ బండికి వేసిన చలానా కొట్టండి’ అంటూ కొందరు ట్వీట్లు చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ను ఉగ్రవాది అంటూ సంజయ్ చేసిన వ్యాఖ్యల పట్ల టీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. ఉగ్రవాది కాదు ఉద్యమకారుడు అంటూ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పోరాడిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.
By November 20, 2020 at 11:47AM
No comments