Breaking News

భూటాన్ భూభాగంలో గ్రామాన్ని నిర్మించిన చైనా.. డోక్లాంకి 9 కి.మీ. దూరంలోనే!


విస్తరణవాద కాంక్షతో రగలిపోతున్న చైనా కన్ను మరో పొరుగు దేశం భూభాగంపై పడింది. ఓవైపు తూర్పు లడఖ్‌లో భారత్-చైనాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతుండగా.. మరోవైపు భూటాన్‌ను కలుపుకోడానికి డ్రాగన్ ప్రయత్నిస్తోంది. తాజాగా, భూటాన్ ప్రాదేశిక ప్రాంతంలోకి రెండు కిలోమీటర్ల మేర చొచ్చుకెళ్లి ఓ గ్రామాన్ని ఏర్పాటుచేసింది. మూడేళ్ల కిందట భారత్-చైనా సైన్యాలు ఘర్షణ పడిన డోక్లామ్‌కి సమీపంలోనే ఈ గ్రామాన్ని ఏర్పాటుచేయడం గమనార్హం. దీనికి సంబంధించిన ఫోటోను చైనాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ షెన్ షివే ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. చైనా మీడియా సీజీటీఎన్ న్యూస్‌లోని సీనియర్ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తోన్న షెన్ షివే ట్విట్టర్‌లో పోస్ట్ చేసి.. డోక్లాం ప్రాంతం పరిష్కారం తరువాత ఖచ్చితమైన స్థానాన్ని సూచించింది అని పేర్కొన్నారు. అయితే, తర్వాత ఆ ట్వీట్‌ను తొలగించారు. షెన్ షివే చేసిన ట్వీట్‌ను భారత్‌కు చెందిన ఓ సీనియర్ జర్నలిస్ట్ షేర్ చేశారు. భూటాన్ భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందనడానికి ఇదే సాక్ష్యం అని తెలిపారు. భారత్-చైనాల మధ్య కొనసాగిన డోక్లామ్ వివాదాస్పద ప్రాంతానికి ఇది 9 కిలోమీటర్ల దూరంలో ఉందని చైనా జర్నలిస్ట్ షేర్ చేసిన మ్యాప్‌ను బట్టి అర్ధమవుతుందని అన్నారు. అంతేకాదు, భూటాన్ భూభాగంలో రెండు కిలోమీటర్ల చొచ్చుకొచ్చినట్టు తెలియజేస్తుందని పేర్కొన్నారు. భూటాన్ ప్రాదేశిక సమగ్రత బాధ్యతలను భారత్ తీసుకున్నందున తాజా పరిణామాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. భారత్- భూటాన్-చైనా త్రికూడలి డోక్లాంపై దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది. ఈ ప్రాంతం తమదేనంటూ చైనా వాదిస్తోంది. 2017లో ఇరు సైన్యాల మధ్య దాదాపు మూడు నెలల పాటు కొనసాగిన ఉద్రిక్తతలకు చర్చల ద్వారా తెరపడింది. భారత‌ ప్రాదేశిక సమగ్రతకు భూటాన్ అత్యంత కీలకం. ఈశాన్య రాష్ట్రాలను భారత్‌కు చెందిన మిగతా భూభాగంతో కలిపే సిలిగురి కారిడార్‌కు సమీపంలోనే భూటాన్ ఉంది. ఈ నేపథ్యంలో సరిహద్దు విషయంలో భూటాన్ ఏమాత్రం రాజీపడినా అది భారత్‌కు రక్షణపరమైన చిక్కులు తెచ్చే అవకాశం ఉందని భార‌త‌ రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగానే 2017లో డోక్లామ్ ఉద్రిక్తతల సందర్భంగా భారత్ భూటాన్‌కు మద్దతుగా నిలిచింది.


By November 20, 2020 at 08:12AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/border-standoff-china-sets-up-village-within-bhutan-9-km-from-doklam-face-off-site/articleshow/79314330.cms

No comments