యూపీ: ట్రక్కును ఢీకొన్న జీపు.. ఆరుగురు చిన్నారులు సహా 14 మంది మృతి
ఉత్తర్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రతాప్‌గఢ్ వద్ద ప్రయాగ్‌రాజ్-లక్నో జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న ట్రక్కును జీపు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆరుగురు చిన్నారులు సహా 14 మంది ప్రాణాలు కోల్పోగా... పలువురు గాయపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వేగంగా వచ్చిన జీపు ఆగి ఉన్న ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో జీపు నుజ్జునుజ్జయి అందులోని ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. జీపు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ప్రమాదం గురించి పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడవుతాయని అధికారులు తెలిపారు. కేసు నమోదుచేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితి సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో బాధితులకు మెరుగైన చికిత్స అందజేయాలని సూచించారు.
By November 20, 2020 at 07:33AM
No comments