Breaking News

ల్యాండ్‌లైన్ నుంచి మొబైల్‌కు ఫోన్ చేస్తే ముందు ఆ నెంబరు చేర్చాలి.. జనవరి 1 నుంచి అమల్లోకి


దేశంలో ల్యాండ్‌లైన్ నుంచి మొబైల్ ఫోన్‌కు డయల్ చేసినప్పుడు నెంబరుకు ముందు సున్నా (0) తప్పనిసరి. ఈ మేరకు టెలికం శాఖ మార్గదర్శకాలను జారీచేసింది. ఈ నిబంధనలు 2021 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ల్యాండ్‌లైన్ నుంచి మొబైల్‌కు ఫోన్‌ చేసినప్పుడు ముందు సున్నా చేర్చాలనే ట్రాయ్‌ ప్రతిపాదనకు టెలికం శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ల్యాండ్‌లైన్‌ నంబరు డయిలింగ్‌ ప్యాట్రన్‌లో మార్పులు చేయాలని టెలికాం సంస్థలకు సూచించింది. తాజా నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత ల్యాండ్‌లైన్‌ నుంచి మొబైల్‌కు కాల్‌ చేసినప్పుడు సున్నాను చేర్చడాన్ని అనుసరించాలని టెలికాం శాఖ స్పష్టం చేసింది. ఈ నిబంధన గురించి ల్యాండ్‌లైన్‌ చందాదారులకు తెలియజేయాలని పేర్కొంది. ల్యాండ్‌లైన్ నుంచి మొబైల్ ఫోన్‌కు కాల్ చేసేటప్పుడు ముందుగా సున్నా చేర్చాలని ఈ ఏడాది మే 29 ప్రతిపాదనలు చేసింది. ఈ ‘కొత్త మార్గదర్శకాల ప్రకారం.. ల్యాండ్‌లైన్ నుంచి మొబైల్‌కు కాల్స్ చేసినప్పుడు '0' డయల్ చేయాలి... ఈ అంశం గురించి ల్యాండ్‌లైన్ చందాదారులకు తెలియజేయడానికి త్వరలోనే ప్రకటన వెలువడుతుంది’ అని నవంబరు 20న జారీచేసిన ప్రకటనలో పేర్కొంది. జనవరి 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయని, ఫిర్యాదులు కూడా అప్పుడే స్వీకరిస్తామని తెలిపింది. ఒక నిర్దిష్ట కాల్ కోసం సున్నాను ప్రవేశపెట్టడం టెలిఫోన్ నంబర్‌లో అంకెల సంఖ్యను పెంచడంతో సమానం కాదని ట్రాయ్ పేర్కొంది. డయలింగ్ సరళిలో మార్పులు భవిష్యత్ అవసరాలను తీర్చడానికి మొబైల్ సేవలకు 2,544 మిలియన్ నెంబర్లు అదనంగా సమకూరుతాయని ట్రాయ్ తన ప్రతిపాదనల్లో వివరించింది.


By November 25, 2020 at 10:12AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/telecom-department-accepts-proposal-on-0-prefix-for-all-calls-from-landlines-to-mobile-phones/articleshow/79401950.cms

No comments