Breaking News

దేశవ్యాప్తంగా వాహనదారులకు అలర్ట్.. జనవరి 1 నుంచి కొత్త నిబంధన, అది మస్ట్!


దేశవ్యాప్తంగా వాహనదారులకు అలర్ట్.. జనవరి 1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి రానుంది. ఎలక్ట్రానిక్ విధానంలో టోల్‌ వసూళ్లను మరింతగా పెంచే చర్యల్లో భాగంగా అన్ని ఫోర్‌ వీలర్లకు ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. గతంలో మినహాయింపు పొందిన పాత వాహనాలు తప్పనిసరిగా ఫాస్టాగ్‌ తీసుకోవాల్సిందే.. 2021 జనవరి 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ఈ మేరకు రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ శనివారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. కేంద్రం 1989 నాటి మోటారు వాహన చట్టంలో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2017 డిసెంబర్ ‌1 కంటే ముందు కొనుగోలు చేసిన వాహనాలకూ ఈ నిబంధనలు వర్తించనున్నాయి. టోల్ గేట్ల దగ్గర ట్రాఫిక్‌ను నియంత్రించాలనే లక్ష్యంతో ఫాస్టాగ్‌ విధానాన్ని కేంద్రం 2017 నుంచి అమలు చేస్తోంది. 2019 అక్టోబర్‌లో దేశవ్యాప్తంగా ఫాస్టాగ్‌ అమలును తప్పనిసరి చేసింది. ఈ క్రమంలో ద్విచక్ర, మూడు చక్రాల వాహనాలతో పాటు పాత వాహనాలకు ఫాస్టాగ్‌ నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే తాజా ఉత్తర్వులతో వచ్చే ఏడాది నుంచి అన్ని నాలుగు చక్రాల వాహనాలకూ ఫాస్టాగ్‌ తప్పనిసరైంది. ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాలకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ రెన్యువల్‌ చేయించాలంటే ఫాస్టాగ్‌ తప్పనిసరి అని తాజా నిబంధనల్లో పేర్కొన్నారు. అలాగే థర్డ్‌ పార్టీ బీమా తీసుకోవాలన్నా ఫాస్టాగ్‌ తీసుకోవాలన్న నిబంధనను వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి అమలు చేయనున్నారు. తాజా నోటిఫికేషన్‌ ప్రకారం టోల్‌ ప్లాజాల వద్ద ఇక 100 శాతం ఫాస్టాగ్‌ ద్వారానే చెల్లింపులు జరగనున్నాయి.


By November 08, 2020 at 07:14AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/fastag-must-for-four-wheeler-vehicles-from-1st-january-2021/articleshow/79107514.cms

No comments