చైనా ఒత్తిడితో దుస్సాహసం.. పాకిస్థాన్‌లో గిల్గిత్-బాల్టిస్థాన్ విలీనం!
కరోనా వైరస్‌తో తలెత్తిన అస్థిరతను అనుకూలంగా మలచుకుని వివాదాస్పద గిల్గిత్-బాల్టిస్థాన్‌ను ప్రాంతాన్ని వీలీనం చేసుకోవడానికి పాక్ ప్రయత్నిస్తోంది. ఈ వ్యవహారం వెనుక చైనా హస్తం ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. గిల్గిత్-బాల్టిస్థాన్ (జి-బి) స్థాయిని మార్చాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు పాకిస్థాన్ కశ్మీర్ వ్యవహారాల మంత్రి అలీ అమీన్ గండాపుర్‌లో ఇటీవల మీడియాతో అన్నారు. దీనిపై లాంఛనమైన ప్రకటన చేయడానికి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ త్వరలో ఈ ప్రాంతంలో పర్యటించనున్నారని పేర్కొన్నారు. వాస్తవానికి గిల్గిత్-బాల్టిస్థాన్ స్వయంప్రతిపత్తి ప్రాంతం. దీన్ని అలాగే కొనసాగించి, తన వాదనలకు చట్టబద్ధత కల్పించేందుకు పాక్ ఈ ప్రాంతాన్ని ప్రావిన్షియల్ ఆర్డినెన్స్‌ల ద్వారా పాలిస్తోంది. తరచూ విధానపరమైన మార్పులను చేయడం ద్వారా జి-బి రాజ్యాంగ హోదాపై ఉద్దేశపూర్వకంగా అస్పష్టతను కలిగించింది. ఇక, 1949 నాటి కరాచీ ఒప్పందం తర్వాత జి-బి ప్రాంతాన్ని బ్రిటిష్ కాలం నాటి ఫ్రాంటియర్ క్రైమ్ రెగ్యులేషన్స్ (ఎఫ్‌సీఆర్) ద్వారా పాకిస్థాన్ పాలన సాగిస్తోంది. తర్వాత 1975లో దీనిని రద్దుచేసి సివిల్, క్రిమినల్ చట్టాలను అమల్లోకి తెచ్చింది. 1994లో ఉత్తర ప్రాంతాల లీగల్ కౌన్సిల్ చట్టం, 2009లో గిల్గిత్-బాల్టిస్థాన్ సాధికారత, స్వయం పాలన చట్టాన్ని తీసుకొచ్చింది. దీని స్థానంలో 2019లో మరో చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. మూడు అణ్వస్త్ర దేశాలైన భారత్, పాకిస్థాన్, చైనా సరిహద్దు కూడలి అయిన జి-బి.. ఆసియాలో అత్యంత కీలకమైన ప్రదేశం. మధ్య ఆసియా, నైరుతి ఆసియా, దక్షిణాసియా సహా అనేక ప్రాంతాలను ఇది అనుసంధానం చేస్తోంది. అందువల్ల చైనా విస్తరణవాద ప్రణాళికలో ఈ ప్రాంతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ (సీపెక్) ప్రాజెక్టును సాఫీగా పూర్తి చేయడానికి, ఈ ప్రాంతంలో చైనా టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేయడానికి అంతిమంగా తన వలసరాజ్యంగా మార్చుకోవడానికి వీలుగా జి-బిని పూర్తిగా పాక్‌లో విలీనం చేయించడం మేలని చైనా భావిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మేరకు పాక్‌పై ఒత్తిడి పెంచి, ఫలితాన్ని రాబడుతోందని తెలిపారు. ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు సిక్కులు పాలించగా.. 1845-46 యుద్ధం తర్వాత ఇది బ్రిటిప్ పాలనలోకి వెళ్లింది. అనంతరం 1935లో నాటి కశ్మీర్ పాలకుడు మహారాజా హరిసింగ్‌కు బ్రిటిష్ ప్రభుత్వం 60 ఏళ్లపాటు లీజుకు ఇచ్చింది. దీంతో ఆయన పాలనలోకి వచ్చింది. అయితే, జి-బి.. ఎప్పుడూ ఏకీకృత జమ్మూ-కశ్మీర్‌లో భాగంగానే ఉంది. పాకిస్థాన్ రాజ్యాంగంలోనూ ఈ ప్రాంతం గురించి ప్రస్తావించలేదు. కానీ, ప్రస్తుతం జి-బి ప్రాంతం తమదేనంటూ పాక్ వాదించడం గమనార్హం. జి-బి ప్రాంతంలో ఉన్న అపార ఖనిజ సంపదలపై చైనా కన్నుపడింది. దీంతో ఎలాగైనా దీనిని తన అధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇక, వల్ల ఈ ప్రాంతంలో ఏడాదికి 36.5 మిలియన్ టన్నుల కార్బన్‌డయాక్సైడ్ విడుదలవుతోందని ఓ అధ్యయనం వెల్లడించింది. సీపెక్‌ను గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చేపట్టిన ఉద్యమాలను ఉక్కుపాదంతో అణిచివేయడానికి పాక్ చేయని ప్రయత్నం లేదు. మానవహక్కుల కార్యకర్తలను అన్యాయంగా అరెస్ట్ చేసి నిర్బంధిస్తోంది.
By October 05, 2020 at 08:28AM
No comments