అటల్ సొరంగ మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని
ప్రపంచంలోనే అతి పెద్ద సొరంగ మార్గాన్ని ప్రధాని మోదీ శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని రోహ్‌తంగ్ వద్ద నిర్మించిన ఈ వ్యూహాత్మక సొరంగం వల్ల మనాలి-లేహ్ మధ్య 475 కిలోమీటర్ల దూరం 46 కిలోమీటర్లకు తగ్గుతుంది. దీని వల్ల దాదాపు నాలుగున్నర గంటల సమయం ఆదా అవుతుంది. మొత్తం 9.02 కిలోమీటర్ల పొడవున్న ఈ సొరంగ మార్గానికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పేరు పెట్టారు. అన్నిరకాల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకునేలా అత్యాధునిక సాంకేతికతతో దీనిని నిర్మించారు. ఈ సొరంగంలో 80 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేలా నిర్మాణం సాగింది. ఇందులో రోజుకి 3,000 కార్లు, 1,500 ట్రక్కులు ప్రయాణించేందుకు అవకాశం ఉంది. అలాగే, అత్యవసర సమయంలో సమాచారం ఇవ్వడానికి ప్రతి 150 మీటర్లకు టెలిఫోన్ సౌకర్యం ఏర్పాటు చేశారు. ప్రతి 60 మీటర్లకు అత్యాధునిక అగ్నిమాపక వ్యవస్థ, ప్రతి 250 మీటర్లకు ఆటో ఇన్సిడెంట్ డిటెక్షన్ సిస్టం సీసీటీవీ కెమెరాలు, కిలోమీటరుకు గాలి నాణ్యతను గుర్తించే వ్యవస్థలు ఉన్నాయి. అలాగే, ప్రతి 25 మీటర్లకు టెన్నెల్ నుంచి బయటికి వెళ్లేందుకు దారి చూపే సూచీలు, లైటింగ్ వ్యవస్థను అమర్చారు. టన్నెల్‌లో వెలుతురు కోసం సెమీ ట్రాన్స్‌ఫర్ వెంటిలేషన్ సిస్టం ఉంది. మొత్తం రూ.3,500 కోట్లు ఖర్చయిన ఈ సొరంగ మార్గం.. పదేళ్ల పాటు నిర్మాణం సాగింది. వాస్తవానికి ఈ ఏడాది మే నెలలో ఇది ప్రారంభంకావాల్సి ఉన్నా లాక్‌డౌన్ కారణంగా ఆలస్యమైంది. ఈ సొరంగ మార్గానికి 2002 మే 26న శంకుస్థాపన చేసి, ఆరేళ్లలో దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వాతావరణ పరిస్థితులు, ఇతరత్రా కారణాల వల్ల ఇప్పటికి ఇది అందుబాటులోకి వచ్చింది. ఈ సొరంగ మార్గం సైన్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
By October 03, 2020 at 10:50AM
No comments