హథ్రాస్ కేసు: బాధితుల తరఫున వాదించనున్న నిర్భయ లాయర్ సీమా
నిర్భయ హత్యాచారం కేసును ఛాలెంజ్‌గా తీసుకుని దోషులకు శిక్షపడేలా చేసిన యువ మహిళా న్యాయవాది .. హాథ్రాస్ కేసులోనూ వాదనలు వినిపించనున్నట్టు తెలుస్తోంది. బాధితురాలి కుటుంబాన్ని కలిసేందుకు సీమా గురువారం ప్రయత్నించగా.. పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. అయితే, తాను మాత్రం వారిని కలవకుండా తిరిగి వెళ్లేదిలేదని తెగేసిచెప్పారు. సీమా మీడియాతో మాట్లాడుతూ ..‘తమ తరఫున నిలబడి న్యాయం చేయాల్సిందిగా బాధితురాలి కుటుంబ సభ్యులు కోరారు. అయితే అధికారులు మాత్రం వారిని కలిసేందుకు అనుమతించడం లేదు. కానీ ఆ కుటుంబాన్ని కలవకుండా నేను తిరిగి వెళ్లేది లేదు’ అని స్పష్టం చేశారు. బాధితురాలి సోదరుడితో తాను మాట్లాడుతున్నట్టు ఆమె తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో 2012 డిసెంబర్ 16న అర్ధరాత్రి స్నేహితుడితో కలిసి బస్సులో ప్రయాణిస్తోన్న నిర్భయపై ఆరుగురు కామాంధులు అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిర్భయ తరఫున సీమా కుష్వాహా వాదించి దోషులకు శిక్షపడేలా చేశారు. నలుగురు నిందితులను ఈ ఏడాది మార్చిలో ఉరితీశారు. ఇక హాథ్రాస్ ఘటనలో 19 ఏళ్ల దళిత యువతిపై నలుగురు అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆమెను దారుణంగా హింసించడంతో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని తొలుత అలీగఢ్ యూనివర్సిటీ మెడికాల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో తర్వాత ఢిల్లీలో సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మంగళవారం ఉదయం మృతిచెందింది. కాగా, ఈ కేసు విచారణకు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.
By October 02, 2020 at 01:20PM
No comments