Breaking News

కోవిడ్ నిధుల్లో అక్రమాలు.. అండర్‌వేర్‌లో సొమ్ముతో పట్టుబడ్డ సెనేటర్


కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటానికి కేటాయించిన నిధుల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో‌కు కుడి భుజంగా చెప్పుకునే సెనేటర్‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సెనేటర్ చికో రోడ్రిగ్స్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్టు స్థానిక మీడియా తెలిపింది. రోరైమాలోని రోడ్రిగ్స్ నివాసంలో బుధవారం సోదాలు నిర్వహించిన అధికారులు.. అండర్‌వేర్‌లో దాచిపెట్టిన సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 30వేల రియల్స్ (5,300 డాలర్లు) రోడ్రిగ్స్ అండర్‌వేర్‌‌లో గుర్తించారని బ్రెజిల్ మీడియాలో వెల్లడించింది. రోరైమా రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కేటాయించిన ప్రజా నిధులను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు ధ్రువీకరించారు. దర్యాప్తులో భాగంగా సోదాలు నిర్వహించామని చెప్పిన పోలీసులు.. నగదు ఎక్కడ దొరికిందనే విషయం గురించి ప్రస్తావించలేదు. ఇదిలా ఉండగా.. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రోడ్రిగ్స్ ఖండించారు. తాను ఏ తప్పూ చేయలేదని, ఓ సెనేటర్‌గా ఉన్న తన నివాసంలో అక్రమంగా సోదాలు నిర్వహించారని ఫిర్యాదు చేశారు. తాజాగా ఘటనను మీడియా సృష్టిగా బ్రెజిల్ అధ్యక్షుడు ఆరోపించారు. ప్రభుత్వంపై అవినీతి ముద్రవేయడానికే ఇటువంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరు అవినీతికి పాల్పడినా సహించబోమని, తమ ప్రభుత్వంలో అవినీతి లేదనడానికి ఈ ఆపరేషన్ ఓ ఉదాహరణ అని అన్నారు. అవినీతిపై పోరాటం చేస్తామనే వాగ్దానంతో 2018 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన .. ఆ దిశగా చర్యలు తీసుకోవడం విఫలమయ్యారు. అధ్యక్షుడి సహా ఆయన కుటుంబంపై అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బోల్సోనారో రియో డి జినారో లెజిస్లేటర్‌గా ఉన్నప్పుడు ఆయన తనయుడు ఫ్లావియో ప్రజా నిధులను దుర్వినియోగం చేసినట్టు కేసు నమోదయ్యింది. మాజీ న్యాయ మంత్రి సెర్గియో మోరో చేసిన ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోంది. అయితే, అధ్యక్షుడు తన కుటుంబ సభ్యులు, స్నేహితులను రక్షించడానికి పోలీసుల దర్యాప్తులో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించారు.


By October 16, 2020 at 12:04PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/brazilian-senator-president-bolsonaro-righ-hand-caught-hiding-money-in-his-underwear/articleshow/78695914.cms

No comments