Breaking News

కాంగ్రెస్‌కు నటి కుష్బూ రాజీనామా‌.. బీజేపీలో చేరిక?


నటి ఖుష్బూ పార్టీని వీడి బీజేపీలో చేరుతారనే ప్రచారం ఇటీవల జోరుగా సాగిన విషయం తెలిసిందే. అందరూ అనుకున్నట్టుగానే, ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈమేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీకి తన రాజీనామా లేఖను పంపారు. కాంగ్రెస్ పార్టీ పదవులతోపాటు ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు సోనియాకు రాసిన లేఖలో కుష్బూ పేర్కొన్నారు. దీంతో కాంగ్రెస్తో ఆరేళ్ల అనుబంధానికి నటి ఖుష్బూ తెగదెంపులు చేసుకున్నట్టయ్యింది. ఆమె అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో సోమవారం కాషాయ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో జాతీయ అధికార ప్రతినిధిగా తనకు అవకాశం కల్పించినందుకు సోనియాకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంగా నిర్వహించానని, దీనిని గర్వంగా భావిస్తున్నానని అన్నారు. కొంతకాలంగా సుదీర్ఘమైన ఆలోచనా ప్రక్రియ తరువాత పార్టీతో అనుబంధాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాను అని రాజీనామా లేఖలో కుష్బూ వివరించారు. అయితే, కాంగ్రెస్ నేతలు మాత్రం ఆమెను పార్టీ పదవులను తప్పించినట్టు పేర్కొన్నారు. ఇక, దక్షిణాది చిత్రసీమలో ఓ వెలుగు వెలిగిన ఖుష్బూ.. తమిళనాట అశేష అభిమానులను సంపాదించుకున్నారు. 90వ దశకంలో తమిళ ప్రేక్షకులు కుష్బూకి నీరాజనాలు పట్టి ఆమెకు ఏకంగా ఆలయాన్నే కట్టారు. సుందర్‌ను వివాహం చేసుకున్న తర్వాత 2010లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. తొలుత డీఎంకేలో చేరిన కుష్బూ.. ఎంకే స్టాలిన్‌తో విభేదించి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఇది జరిగిన దాదాపు నాలుగు నెలల తర్వాత 2014 నవంబరు 26 కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇది నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు అని కాంగ్రెస్ పార్టీలో చేరిన రోజు ఖుష్బూ వ్యాఖ్యానించారు. అంతేకాదు, లౌకికవాద పార్టీయైన కాంగ్రెస్‌లో చేరడం గర్వంగా ఉందని పేర్కొన్నారు.


By October 12, 2020 at 11:48AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/congress-spokesperson-and-actress-khushbu-sundar-quits-party-set-to-join-bjp/articleshow/78614858.cms

No comments