Breaking News

ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై ఎట్టకేలకు వాస్తవాన్ని అంగీకరించిన వైట్‌హౌస్


కరోనా వైరస్ బారినపడ్డ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందా? ఆయన ఆరోగ్యం గురించి చేసిన ప్రకటనల్లో నిజం లేదా? అంటే అవునని వైట్‌హౌస్ ధ్రువీకరించింది. ఈ మేరకు వైట్‌హౌస్ స్టాఫ్ చీఫ్ మార్క్ మెడాస్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అధికారులు వెల్లడించిన దానికి భిన్నంగా ఆయన ఆరోగ్యం శుక్రవారం క్షీణించిందని, జ్వరంతోపాటు రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడంతో హాస్పిటల్‌కు తరలించాలని వైద్యులు సిఫార్సు చేసినట్టు తెలిపారు. శనివారం రాత్రి ఆయన ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ట్రంప్ ఆరోగ్య పరిస్థితి గురించి పై విధంగా స్పందించారు. అయితే, ప్రస్తుతం అధ్యక్షుడి పరిస్థితి మెరుగుపడిందని, ఆయనకు జ్వరం తగ్గి, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు సాధారణ స్థితికి చేరుకున్నాయని వెల్లడించారు. శుక్రవారం ఉదయం గురించి ఆందోళన చెందామని, ఆయనకు జ్వరంతోపాటు ఆక్సిజన్ స్థాయిలు ఒక్కసారిగా పడిపోయాయని అన్నారు. ఇటువంటి క్లిష్ట సమయంలోనూ ట్రంప్ లేచి కలియతిరగడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని, ఆయన యధావిధిగా తన కార్యక్రమాలను చేసుకుంటున్నారని శుక్రవారం ఉదయం మెడాస్ సహా శ్వేతసౌధం అధికారులు పేర్కొన్నారు. ఏదిఏమైనప్పటికీ హాస్పిటల్‌లో చేరాలని వాల్టర్ రీడ్, జాన్ హాప్కిన్స్ వైద్యులు సిఫార్సు చేసినట్టు ఫాక్స్ న్యూస్‌కి తెలిపారు. అయితే, ట్రంప్ ఆరోగ్యం గురించి వైద్యులు సహా మేమంతా ఆందోళన చెందామని, శనివారం ఉదయం నుంచి నమ్మశక్యం కాని విధంగా మెరుగుపడిందని మెడాస్ అన్నారు.


By October 05, 2020 at 07:03AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/white-house-acknowledges-president-trumps-condition-had-been-worse-than-revealed/articleshow/78484117.cms

No comments