మార్క్‌పై జీవరాశి ఉనికి.. కీలకంగా మారిన భారతీయ శాస్త్రవేత్త పరిశోధన
భూమి కాకుండా మరే ఇతర గ్రహాలు మానవ నివాసానికి యోగ్యమైనవేనా? అనే పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయి. చంద్రుడితోపాటు అంగారకుడి (మార్స్)పై అవాసాలు సాధ్యాసాధ్యాలపై విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. ఇక, అంగారక గ్రహంపై నీటి ఆనవాళ్లపై గత రెండేళ్లుగా సుదీర్ఘమై చర్చ జరుగుతోంది. అయితే, అక్కడ మంచుతో కూడిన నీటి సరస్సు, దాని చుట్టుపక్కల మరో మూడింటిని 2018లో గుర్తించినట్టు నేచుర్ పత్రికలో సెప్టెంబరు 28న ఓ అధ్యయనంలో వెల్లడించింది. భారతీయ శాస్త్రవేత్తలు సైతం మార్స్‌పై దశాబ్ద కాలం నుంచి పరిశోధనలు సాగిస్తున్నారు. సౌదీలో పరిశోధనలు చేస్తున్న భారత శాస్త్రవేత్త డాక్టర్ రామ్ కరణ్ ఒక ప్రశ్నకు సమాధానం కోసం దశాబ్దంగా ఎదురుచూస్తున్నాడు. తీవ్రమైన పరిస్థితులలో జీవి ఎలా మనుగడ సాగిస్తుంది, వృద్ధి చెందుతుంది? అనే ప్రశ్నలకు సమాధానాల కోసం అన్వేషిస్తుండగా అంగారక గ్రహంపై నీటి వనరులకు ఆధారాలు గుర్తించారు. సగటు -60 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ గడ్డకట్టకపోవడానికి అధిక లవణీయత కారణమని కరణ్ పేర్కొన్నారు. డాక్టర్ రామ్ కరణ్ సౌదీ అరేబియాలోని కింగ్ అబ్దుల్లా సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీలో ఎంజిమోలజీ రిసెర్చ్ సైంటిస్ట్‌గా ఉన్నారు. ఎర్ర సముద్రం, అంటార్కిటికా సహ ఇతర చోట్ల అధిక లవణీయత, ఆక్సిజన్ రహిత, మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన విపత్కర పరిస్థితులలో సూక్ష్మజీవులు వృద్ధి చెందుతున్న విధానంపై పరిశోధనలు చేస్తున్నారు. ‘అంటార్కిటికాలో ఇలాంటి పరిస్థితులను మేము కనుగొన్నాం. విస్మయానికి గురిచేసే విషయం ఏంటంటే అధిక లవణీయత ఉన్నప్పటికీ, ఎక్స్‌ట్రెమోజైమ్‌లను సేకరించాం. అంగారక గ్రహంపై కూడా ఇటువంటి ఎంజైమ్‌లు, జీవుల ఉనికిని బలపరుస్తుంది’ అని అన్నారు. ఈ మేరకు పరిశోధన ఫలితాలను మైక్రోఆర్గానిజమ్స్ జర్నల్‌లో శుక్రవారం ప్రచురించారు. ఎక్స్‌ట్రెమోఫిలిక్ ప్రోటీన్ల అధ్యయనాలు భూమిపై జీవుల పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడటమే కాకుండా, ఇతర గ్రహాలపై ఎలా జీవించగలదో ఆధారాలను అందజేస్తుంది అని వ్యాఖ్యానించారు. అంటార్కిటిక్ సూక్ష్మజీవిని కనుగొన్నట్లు 2017లో‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా’డాక్యుమెంట్ కూడా ఇలాగే పేర్కొంది. ‘జీవి మనుగడకు పరమాణు ఆధారం.. దీనికి సంబంధించినవి మార్స్ మీద, అలాగే మన గెలాక్సీలో కొత్తగా కనుగొన్న అనేక గ్రహాలలో అన్వేషించాలి’అని సూచించారు. ఇటీవల యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈసా) విడుదల చేసిన ఓ వీడియో.. అంగారక గ్రహంపై జీవజాల ఉనికికి అస్కారం ఉందన్న దానికి మరింత బలాన్ని చేకూరుస్తోంది. అంగారక గ్రహంపై అతి పెద్ద బిలంగా పేర్కొంటున్న కొరొలెవ్ క్రేటర్ పూర్తిగా మంచుతో నిండి ఉంది. ఈ వీడియోలో నీటి ఆనవాళ్లు మంచురూపంలో కనిపిస్తుంది. బిలం 1.8 కిలోమీటర్ల లోతు, 82 కిలో మీటర్ల వెడల్పుతో ఉన్నట్లుగా పేర్కొంది. అంగారక గ్రహంపై ఇదే పెద్ద నీటి ఉనికి కేంద్రంగా చెప్పవచ్చు. అంగారకుడి ఉత్తర ధృవంలో ఉన్న అతిపెద్ద బిలం ఉండగా, ఇందులో మంచు ఏడాది పొడవునా అలాగే ఉన్నట్లు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పేర్కొంది. అక్కడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేకంగా బిలం అడుగున అల్పపీడనం ప్రభావంతోనే ఇది సాధ్యమందని చెప్పింది. గాలిలో తేమశాతం, ఇతర అంశాలు కూడా ఇందుకు కారణం కావొచ్చని తెలిపింది.
By October 18, 2020 at 12:00PM
No comments