Breaking News

అమ్మాయిలూ కత్తులు దగ్గరుంచుకోవాలి.. యూపీ మంత్రి వ్యాఖ్యలపై దుమారం


ఉత్తర్ ప్రదేశ్‌లో మహిళల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా వారిపై అఘాయిత్యాలు, అకృత్యాలు ఆగడంలేదు. ఇటీవల జరిగిన హథ్రాస్ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. మహిళల కోసం యూపీ ప్రభుత్వం మిషన్ శక్తి కార్యక్రమం కొనసాగుతోంది. ఇదిలా ఉండగా మహిళల రక్షణపై యూపీ మంత్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అమ్మాయిలు తమ దగ్గర కత్తులను ఉంచుకోవాలని, అవసరమైనపుడు వాటిని ఉపయోగించాలని ఆ మంత్రి పిలుపునిచ్చారు. జిల్లా అధికారుల సమక్షంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడంతో దుమారం రేగుతోంది. రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం ముఖ్యమంత్రి పలు చర్యలు తీసుకుంటున్నారని చెప్పిన మంత్రి మనోహార్ లాల్.. మహిళలంతా కత్తులు పట్టాలని సలహా ఇచ్చారు. అంతేకాదు, అవసరమైన సందర్భాల్లో మహిళలు కత్తులతో దాడులకు దిగాలని సూచించారు. లలిత్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మనోహార్ లాల్ మాట్లాడుతూ.. మహిళలు, విద్యార్థులు తమ రక్షణ కోసం కత్తులను ఉంచుకోవాలని అన్నారు. జిల్లా అధికారులు, పోలీసు అధికారుల సమక్షంలో మంత్రి ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. మహిళలు ఆందోళన చెందవద్దని, రాష్ట్రమంతా వారికి అండగా ఉంటుందని మంత్రి అన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ యూపీ అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లూ తీవ్రంగా మండిపడ్డారు. మంత్రి బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ఇతర రాష్ట్రాల్లోని మహిళల భద్రత గురించి మాట్లాడుతున్నారు కానీ.. మీ రాష్ట్రంలో పరిస్థితిపై ఎందుకు నోరు విప్పడంలేదని ప్రశ్నించారు.


By October 21, 2020 at 09:40AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/up-minister-manohar-lal-advice-to-girls-to-keep-knife-in-their-pocket/articleshow/78781034.cms

No comments