ఇంటి అద్దె కట్టలేదని వితంతువు పట్ల అమానుషం.. ప్రబుద్ధుడికి సహకరించిన మహిళలు
నవనాగరిక ప్రపంచంలో అనాగరిక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దేశంలో ఎక్కడ చూసినా మహిళలపై అఘాయిత్యాలు, దాడులు పెచ్చుమీరుతున్నాయి. తాజాగా, మానవత్వానికి మాయని మచ్చగా నిలిచే మరో ఉదంతం వెలుగు చూసింది. ఇంటి అద్దె కట్టలేదని ఓ వితంతువును చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. అతటితో ఆగని ఆ ప్రబుద్ధుడు ఆమె ఇంటిలోని సామాన్లు బయటకు విసిరేశాడు. ఈ పనికి కొందరు మహిళలు కూడా నిందితుడికి సాయం చేయడం సిగ్గుచేటు. భర్తను కోల్పోయి ఒంటరిగా జీవిస్తోన్న ఆమె పట్ల జాలి చూపించకపోగా.. సాటి మహిళలే నిందితుడికి సహకరించడం బాధాకరం. ఈ ఉదంతం గురించి సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే అక్కడకు చేరుకుని, బాధితురాలిని విడిపించారు. కేసు నమోదుచేసి నిందితులపై చర్యలు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హమీర్‌పూర్ ప్రాంతానికి చెందిన శోభాదేవి భర్త కొన్నేళ్ల క్రితమే చనిపోయాడు. ప్రస్తుతం అమె భాగీరథ్ ప్రజాపతి అనే వ్యక్తి ఇంట్లో అద్దెకు ఉంటోంది. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే శోభాదేవికి కరోనా కాలంలో ఎక్కడా పని లభించలేదు. దీంతో ఆమె ఇంటి అద్దె చెల్లించలేకపోయింది. దీనికి ఆగ్రహించిన ఇంటి యజమాని కొంతమంది మహిళల వెంటేసుకుని వచ్చాడు. వారి సాయంతో శోభా దేవిని ఇంటిలో నుంచి బయటకు లాక్కొచ్చి చెట్టుకు కట్టేశాడు. తరువాత ఆమెపై దాడిచేసి విచక్షరహితంగా కొట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
By October 12, 2020 at 09:19AM
No comments