Breaking News

సత్యమనే శక్తితో అబద్ధాలను ఓడిస్తాం.. హథ్రాస్ ఘటన‌పై రాహుల్ వ్యాఖ్యలు


హథ్రాస్ ఘటనపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఈ అమానుష చర్యను ఖండిస్తూ కాంగ్రెస్‌ చేపట్టిన నిరసనతో ఉత్తరప్రదేశ్‌ అట్టుడికింది. దేశవ్యాప్తంగా కూడా నిరసన పెల్లుబికింది. బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్న కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీని పోలీసులు నిర్బంధించారు. ఈ సమయంలో చోటుచేసుకున్న తోపులాటలో రాహుల్ కిందపడ్డారు. యుమున ఎక్స్‌ప్రెస్‌ వేపై కాన్వాయ్‌ను యూపీ పోలీసులు అడ్డుకోవడంతో ఏ చట్టం కింద తమను నిరోధించారో చెప్పాలని రాహుల్‌ నిలదీశారు. అనంతరం వాహనం దిగి కాలినడకనే హథ్రాస్‌కు పయనమయ్యారు. ఈ సమయంలో పోలీసులు బలవంతంగా వారిని నిలిపివేయడంతో రాహుల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అడ్డుకోవడంపై మరోసారి రాహుల్ మండిపడ్డారు. తాను ఎవరికీ భయపడనని, ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అసత్యంతో పోరాడుతున్నప్పుడు అన్నింటిని ఎదుర్కొంటానని వ్యాఖ్యానించారు. నేను ప్రపంచంలో ఎవరికీ భయపడను.. ఎలాంటి అన్యాయానికి తలొగ్గను.. సత్యమనే శక్తితో అబద్ధాలను ఓడిస్తాను.. అసత్యంతో పోరాడుతున్నప్పుడు అన్ని పోరాటాలను ఎదుర్కొంటాను ... గాంధీ జయంతికి హృదయపూర్వక శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు, యూపీ పోలీసులపై ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు.‘రహస్యంగా అర్థరాత్రి దాటాక పోలీసుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహిస్తారా?. వీరంతా (బీజేపీ) హిందువులకు ప్రతినిధులమని చెప్పుకుంటారే.. నేనూ హిందువునే. ఏ శాస్త్రాచారాల ప్రకారం ఇలా చేశారో చెప్పగలరా?’ అని ప్రియాంక నిలదీశారు. రాహుల్‌- ప్రియాంకల అరె‌స్ట్‌ను ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్రంగా ఆక్షేపించాయి. ఇది దుర్మార్గమైన చర్యని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని శరద్‌ పవార్‌ అన్నారు. కాంగ్రెస్ నేత పట్ల యూపీ పోలీసులు ప్రవర్తించిన తీరు ఖండించదగింది. చట్టాన్ని అమలుచేయాల్సి వారు ప్రజాస్వామ్య విలువలను ఈ విధంగా తొక్కడం శోచనీయం అని పవార్ ట్వీట్ చేశారు. ‘అణచివేత పాలన, విచక్షణారహితంగా అధికారాన్ని దుర్వినియోగం చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేయడం ప్రతిపక్ష పార్టీల విధి, ప్రజాస్వామ్య హక్కు! ప్రజల స్వరం, సంకల్పాన్ని అణచివేయలేరు.! రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టును మేము నిస్సందేహంగా ఖండిస్తున్నాం’ అని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మండిపడ్డారు. క్షమాపణ చెప్పాలని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌, పదవి నుంచి యోగి తక్షణం వైదొలగాలని బీఎస్పీ చీఫ్‌ మాయావతి డిమాండ్‌ చేశారు.


By October 02, 2020 at 09:41AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/wont-bow-down-to-injustice-says-rahul-gandhi-on-hathras-incident/articleshow/78440766.cms

No comments