Breaking News

అసోం-మిజోరాం సరిహద్దుల్లో ఘర్షణ.. గుడిసెలకు నిప్పంటించి కర్రలు, రాళ్లతో దాడి


అసోం, మిజోరాం సరిహద్దుల్లో ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య చెలరేగిన ఘర్షణలో పలువురు గాయపడ్డారు. మిజోరాంలోని కోలాసిబ్, అసోంలోని కాచర్ జిల్లా సరిహద్దు శివార్లలో శనివారం సాయంత్రం ఆటో రిక్షా స్టాండ్ సమీపంలో ఉన్న కొంతమంది అసోం ప్రజలపై కర్రలు, ఆయుధాలతో దాడికి పాల్పడ్డారు. దీంతో అసోం వైరేంగ్ గ్రామ ప్రజలు భారీగా అక్కడకు చేరుకుని ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని భావించారు. మిజోరాం లైలాపూర్ వాసులు జాతీయ రహదారి వెంబడి నిర్మించిన 20 గుడిసెలు, స్టాల్స్‌కు నిప్పంటించారు. సరిహద్దు వెంబడి లైలాపూర్ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఇళ్లను దుండగులు తగులబెట్టారు. అయితే, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, హింస చెలరేగిన ప్రాంతాల్లో పోలీసు బలగాలను మోహరించినట్లు మిజోరాం అధికారులు ప్రకటించారు. ఈ ఘటనలో నలుగురు మిజోరాం వాసుల సహా చాలా మంది గాయపడ్డారని తెలిపారు. ఘర్షణలో గాయపడిన ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. అతడికి కోలాసిబ్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఆ ప్రాంతంలో అధికారులు 144 సెక్షన్ విధించారు. ఆకస్మికంగా హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకోవడంతో అటు అసోం ముఖ్యమంత్రి కూడా అప్రమత్తమయ్యారు. ప్రస్తుత పరిస్థితి, హింసపై ప్రధాన మంత్రి కార్యాలయంతో పాటు కేంద్ర హోంశాఖకు కూడా సమాచారం ఇచ్చారు. అంతేకాకుండా మిజోరాం ముఖ్యమంత్రి జోరం తాంగాతో కూడా ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు. వైరేంగ్‌కు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సాయిహైపుయ్ ‘వి’ గ్రామం సమీపంలో అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద విధులు నిర్వర్తించే వాలంటీర్ల గుడారాలు ఉన్నాయి. వీటికి దుండగులు నిప్పంటించడంతో ఈ హింసాత్మక ఘర్షణ చెలరేగినట్లు సమాచారం. కోవిడ్-19 నేపథ్యంలో అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద ప్రజల కదలికలను గమనించేందుకు వాలంటీర్లను నియమించారు. మిజోరంతో దాదాపు 165 కిలోమీటర్ల మేర సరిహద్దును అసోం పంచుకుంటోంది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సరిహద్దు వివాదం పరిష్కారానికి 1995 నుంచి చర్చలు కొనసాగుతున్నా.. ఫలితం పెద్దగా లేకపోయింది. దీంతో ఈ విషయంపై అసోం, మిజోరాంలు తరుచూ గొడవపడుతూనే ఉన్నాయి. ఈ ఘర్షణలపై ఇరువురు ముఖ్యమంత్రులు ఫోన్‌లో చర్చించారు. సరిహద్దు వివాదాల పరిష్కారంలో ఇరు రాష్ట్రాలు కలిసి కట్టుగా ముందుకు సాగాలని, శాంతియుతంగానే పరిష్కరించుకోవాలని అసోం సీఎం సోనోవాలా అన్నారు. దీనికి మిజోరాం ముఖ్యమంత్రి జోరం తంగా సానుకూలంగా స్పందించారు. సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం నెలకొనడానికి, సమస్యల పరిష్కారానికి తప్పకుండా సహకారం అందిస్తామని ప్రకటించారు. కానీ, ఈ ఘటనపై కేంద్రానికి మిజోరాం సైతం ఫిర్యాదు చేసింది. మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి దీనిపై చర్చిస్తామని, అసోం ప్రభుత్వం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. అతిక్రమణలకు పాల్పడటంతోనే ఇలాంటి హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నాయని మిజోరం సీఎం జోరంథంగా మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే లర్లీన్‌టుంగ్ల సైలో మాట్లాడుతూ... ‘తమకు అసోం ప్రజలు, ప్రభుత్వంతో ఎటువంటి శత్రుత్వం లేదు. కానీ, సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న అక్రమ బంగ్లాదేశ్ వలసదారుల చొరబాటు నుంచి మా భూభాగాన్ని కాపాడుతున్నాం’ అని సైలో అన్నారు. శాంతిభద్రతలను పరిరక్షించడానికి ఇరు రాష్ట్రాలూ కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అటు అసోం అటవీ శాఖ మంత్రి పరిమళ శుక్ల బైద్యా మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో అక్రమంగా ఇరు వర్గాలు చెట్లను నరకడంతో ఇటువంటి ఘర్షణలు ఏటా జరుగుతున్నాయని అన్నారు.


By October 19, 2020 at 09:29AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/several-injured-in-violent-clash-between-assam-mizoram-border/articleshow/78741673.cms

No comments