యూపీలో మరో దారుణం: డ్రగ్స్ ఇచ్చి గ్యాంగ్ రేప్.. తీవ్రగాయాలో దళిత యువతి మృతి
ఉత్తర్ ప్రదేశ్‌లో కామాంధుల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతుంది. దేశవ్యాప్తంగా హత్రాస్ ఘటనపై నిరసనలు వెల్లువెత్తుతుండగా... అక్కడ మరో దారుణం చోటుచేసుకుంది. హత్రాస్‌కు 500 కి.మీ. దూరంలో ఉన్న బలరాంపూర్‌లో మరో దళిత యువతిపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆమె హత్యకు కారణమయ్యారు. ఆమెను అత్యంత దారుణంగా హింసించడంతో ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతిచెందింది. సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులు ఆమెను తీవ్రంగా గాయపరచడం వల్లే చనిపోయిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. గయశ్రీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. దళిత యువతిపై మరో సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు యువకులు అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఓ ప్రయివేట్ సంస్థలో పనిచేసే బాధితురాలు.. మంగళవారం విధులకు వెళ్లి సాయంత్రం పొద్దుపోయినా ఇంటికి రాలేదు. తర్వాత బుధవారం తెల్లవారుజామున తీవ్రగాయాలతో ఇంటికి చేరింది.. అనంతరం ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయినట్టు బలరామ్‌పూర్ ఎస్పీ దేవ్ రంజన్ వర్మ తెలిపారు. యువతిని తీవ్రంగా హింసించినట్టు ప్రచారం జరుగుతోందని, అటువంటి ఆనవాళ్లు ఏమీ కనిపించడంలేదని ఎస్పీ అన్నారు. పోస్ట్‌మార్టం నివేదికలో వీటిని ధ్రువీకరించలేదన్నారు. మంగళవారం ఉదయం ఉద్యోగానికి వెళ్లిన తన కుమార్తెను నిందితులు అపహరించారని బాధితురాలి తల్లి పేర్కొంది. తన కూతురికి డ్రగ్స్ ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేశారని.. అనంతరం సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అత్యాచారానికి పాల్పడటమే కాకుండా ఆమెను దారుణంగా కొట్టి హింసించారని తెలిపింది. అనంతరం ఓ ఆటోలో ఇంటికి పంపించారని.. తనను బతికించమంటూ కుమార్తె వేడుకుందని ఆమె ఆవేదన వెల్లగక్కింది. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే బాధితురాలు మృతిచెందింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారిలో ఒకరు మైనర్ అని తెలుస్తోంది. ఇక ఈ ఘటనపై యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. ‘హత్రాస్ బాధితురాలిలా యూపీలోని బలరాంపూర్‌లో మరో యువతి నరకాన్ని అనుభవించి మరణించింది. బీజేపీ ప్రభుత్వం కనీసం ఈ ఘటనకు కారణమైన నిందితులపైన అయినా వెంటనే చర్యలు తీసుకోవాలి’ అని ట్వీట్ చేశారు.
By October 01, 2020 at 08:39AM
No comments