పండగలు భారీగా జరుపుకోవాలని ఏ దేవుడూ చెప్పలేదు: కేంద్ర ఆరోగ్య మంత్రి
వచ్చేది పండుగల సీజన్ కావడంతో మరింత అప్రమత్తంగా ఉండాలని, మహమ్మారి వ్యాప్తి మరింత ఎక్కువగా ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష్ వర్ధన్ పిలుపునిచ్చారు. మతపరమైన కార్యక్రమాలను భారీగా జరుపుకోవాలని ఏ మతం లేదా దేవుడు సూచించలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. భారీగా హాజరయ్యే సమావేశాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఒకవేళ కోవిడ్ -19 వ్యాప్తిని నివారించడానికి ముందు జాగ్రత్తలను జాగరూకతతో పాటించకపోతే దేశం పెద్ద ఇబ్బందులు ఎదుర్కొంటుందని హెచ్చరించారు. ‘అసాధారణ పరిస్థితులకు అసాధారణమైన రీతిలో ప్రతిస్పందించాలి.. పూజలు, ప్రార్థనల కోసం మండపాలు, దేవాలయాలు, మసీదులను సందర్శించాలని ఏ మతం లేదా దేవుడు చెప్పలేదు’ అని అన్నారు. దేశంలో వ్యాక్సిన్ అత్యవసర వినియోగం గురించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. అత్యవసర వినియోగం కింద టీకా ఆమోదం కోసం తగినంత భద్రత, సమర్థత అవసరం. తదుపరి చర్యలు క్లినికల్ ట్రయల్స్ డేటాపై ఆధారపడి ఉంటుందని వివరించారు. కేవలం 45 నిమిషాల్లోనే ఫలితం వచ్చే ఫెలూడా పేపర్ ఆధారిత కరోనా పరీక్ష కిట్ తర్వలోనే అందుబాటులోకి రానుందని తెలియజేశారు. గత మూడు రోజులుగా దేశంలో యాక్టివ్ కేసులు 9 లక్షల కంటే తక్కువగా ఉన్నాయి. అయితే, రాబోయేది పండగలు, శీతాకాలం కావడంతో ప్రభుత్వ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శీతాకాలంలో వైరస్ వ్యాప్తి ఉద్ధృతంగా ఉంటుందని కేంద్ర మంత్రి అన్నారు. శీతల వాతావరణం, తక్కువ ఆర్ధ్రత పరిస్థితులు వైరస్‌కు అనుకూలంగా ఉంటాయని, శీతకాలంలో కోవిడ్-19 సంక్రమణ పెరుగుతుందని ఊహించడం తప్పుకాదన్నారు. కాబట్టి, కరోనా కట్టడికి మాస్క్ ధరించడం ముఖ్యంగా బయటకు వెళ్లేటప్పుడు, చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు.
By October 12, 2020 at 07:23AM
No comments