Breaking News

BECA: భారత్, అమెరికా సంబంధాల్లో కీలక అడుగు.. ఇక చైనాకు చుక్కలే!


రిహద్దులో చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న వేళ.. భారత్ చడీచప్పుడు లేకుండా అడుగులు వేస్తోంది. అగ్రరాజ్యం అమెరికాతో కీలక ఒప్పందం చేసుకుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ‘బెకా’ () ఒప్పందంపై ఇరు దేశాల నేతలు మంగళవారం (అక్టోబర్ 27) సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం.. రక్షణ, భద్రతా రంగాల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం మరింత మెరుగుపడింది. ఒప్పందంలో భాగంగా అమెరికా ఉపగ్రహాలు, సెన్సార్లు సేకరించే సమాచారాన్ని, భౌగోళిక, అంతరిక్ష సమాచారాన్ని భారత్‌తో పంచుకుంటుంది. తద్వారా వ్యూహాత్మక అడుగులు వేయడానికి అవకాశం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే సరిహద్దులో చైనా కదలికలపై ఇక సంపూర్ణ నిఘా ఉంటుంది. అక్కడ చీమ చిటుక్కుమన్నా భారత్‌కు తెలిసిపోతుంది. అంతేకాకుండా యుద్ధం లాంటి పరిస్థితులు వస్తే భారత్‌ సేనలకు అమెరికా దళాలు మద్దతుగా నిలుస్తాయి. తద్వారా శత్రువును నిలువరిస్తాయి. ఈ వివరాలను బయటకి వెల్లడించకున్నా.. తాజా చర్చల సారాంశం ఇదేనని తెలుస్తోంది. భారత్, అమెరికా దేశాల మధ్య కుదిరిన రక్షణ ఒప్పందంతో చైనా వెన్నులో వణుకు పుట్టినట్లే. అయితే.. చైనా ప్రస్తావన లేకుండానే భారత్ ఈ కీలక ఒప్పందాలను చేసుకోవడం గమనార్హం. తాజా చర్చల్లో భారత్ తరఫున రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ పాల్గొన్నారు. అమెరికా తరఫున ఆ దేశ రక్షణ శాఖ మంత్రి మార్క్‌ ఎస్పర్‌, అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్‌ పాంపియో వచ్చారు. ఈ సమావేశాల కోసం వీరిద్దరూ సోమవారమే ఢిల్లీ చేరుకున్నారు. ఇరు దేశాల నేతలు, అధికారులు మంగళవారం ఉదయం ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో భేటీ అయ్యారు. భారత్, అమెరికా మధ్య తొలి చర్చలు 2018 సెప్టెంబరులో ఢిల్లీలో జరిగాయి. 2019 డిసెంబరులో వాషింగ్టన్‌లో రెండో దఫా చర్చలు జరిగాయి. తూర్పు సరిహద్దుల్లో చైనా పదే పదే రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్న వేళ తాజా చర్చలకు ప్రాధాన్యం సంతరించుకుంది. BECA ఒప్పందంపై ఎవరేమన్నారు? రెండు ప్రజాస్వామ్య దేశాలు కలిసి అభివృద్ధి చెందే అవకాశం బెకా ఒప్పందం ద్వారా లభించింది. ప్రపంచంలో కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, ప్రపంచ రక్షణ అంశాలపై చైనా ప్రభావం తదితర అంశాలపై ఇంకా చర్చించాల్సి ఉంది - అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో గతానికి భిన్నంగా ఏడాది కాలంలో రక్షణ, భద్రత రంగాల్లో భారత్, అమెరికా దేశాలు మరింత బలపడ్డాయి. ఇండో పసిఫిక్‌ రీజియన్‌లోని భద్రతాపరమైన సమస్యల పరిష్కారానికి బెకా ఒప్పందం మరింత దోహదపడుతుంది - అమెరికా రక్షణ శాఖ మంత్రి మార్క్‌ ఎస్పర్‌ ‘బెకా’ ఒప్పందాన్ని పూర్తి చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇరు దేశాల మధ్య సమాచార మార్పిడికి ఇది కొత్త మార్గాలను తెరిచింది - భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గత రెండు దశాబ్దాలుగా భారత్‌, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమవుతున్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొవడం చాలా ప్రధానం. దీనికి భారత్‌, అమెరికా మధ్య సంబంధాలు దోహదం చేస్తాయి - భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ Must Read:


By October 27, 2020 at 03:05PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-us-sign-basic-exchange-and-cooperation-agreement-in-2-plus-2-talks-in-delhi/articleshow/78889608.cms

No comments