Breaking News

కరోనాతో నల్లగా మారిపోయిన వైద్యుడి చర్మం.. 5 నెలల తర్వాత సాధారణ స్థితికి!


మహమ్మారి సోకిన తర్వాత బాధితుల్లో పలు కొత్త సమస్యలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. మానసికంగా, శారీరకంగా అనేక ప్రభావం చూపుతోన్న మహమ్మారి గురించి పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మహమ్మారి గురించి మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. కోవిడ్-19 బారిన పడిన ఓ వైద్యుడి చర్మపు రంగు నల్లగా మారిపోయింది. అయితే కరోనా నుంచి కోలుకున్న కొన్ని నెలల తరువాత తిరిగి పూర్వపు రంగును సంతరించుకుంది. దీంతో ఆ వైద్యుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వైరస్‌కు మూలకేంద్రమైన వుహాన్‌లోనే ఇది చోటుచేసుకుంది. వుహాన్‌కు చెందిన హృద్రోగ నిపుణుడు డాక్టర్ యీ ఫ్యాన్ (42) .. కరోనా రోగులకు చికిత్స అందజేసే క్రమంలో మహమ్మారి బారిన పడ్డారు. దీంతో ఆయనను ఆస్పత్రిలో చేర్చించి చికిత్స అందజేయగా 39 రోజుల తర్వాత కోలుకున్నారు. అయితే, ఈ సమయంలో ఫ్యాన్ చర్మం నల్ల రంగులోకి మారిపోయింది. తాజాగా ఆయన చర్మం పూర్వ రంగును సంతరించుకుంది. ఈ విషయాన్ని ఫ్యాన్ స్వయంగా వెల్లడిస్తూ ఓ వీడియోను విడుదల చేసి కరోనా వైరస్ ఎంత ప్రమాదకారో తెలియజేశారు. మహమ్మారి గురించి చాలా విషయాలు తెలుసుకున్నాక తాను ఎంతో భయపడ్డానని తెలిపారు. ఐదు నెలల తర్వాత డాక్టర్ యీ సోమవారం విధులకు తిరిగి హాజరయ్యారు. తనకు వైద్యం చేసిన డాక్టర్ వాంగ్ చెన్‌కు యీ ధన్యవాదాలు తెలిపారు. జనవరి 18న కరోనా కారణంగా ఆసుపత్రిలో చేరిన డాక్టర్ ఫ్యాన్ 39 రోజుల పాటు చికిత్స అనంతరం బయటపడ్డారు. ఈ సందర్భంగా ఆయన సహచరుడు మాట్లాడుతూ... డాక్టర్ యీ ఫ్యాన్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉన్నప్పుడు యాంటీ బయోటిక్స్ తీసుకున్నారని, ఈ కారణంగానే అతని చర్మం నల్లబడిందని తెలిపారు. శరీరంలో హైపర్-పిగ్మెంటేషన్ ఏర్పడింది, కానీ, ఆయన కోలుకోవడంతో పరిస్థితి నెమ్మదిగా సాధారణ స్థితికి వచ్చిందని వివరించారు. డాక్టర్ ఫ్యాన్‌తో పాటు మరో వైద్యుడు హ్యూ వైఫెంగ్‌కు ఒకే రోజు వైరస్ నిర్ధారణ అయ్యింది. ఆయన చర్మం కూడా నలుపు రంగులోకి మారిపోగా.. మహమ్మారితో దాదాపు ఐదు నెలలు పోరాడి ఓడిపోయారు. చికిత్స పొందుతూ జూన్‌లో హ్యూ కన్నుమూశారు.


By October 28, 2020 at 09:17AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/china-doctor-whose-skin-turned-dark-due-to-coronavirus-appears-after-his-colour-returned-to-normal/articleshow/78904063.cms

No comments