Breaking News

ఆగస్టు 5 నాటి అవమానం మరచిపోలేం.. ఆర్టికల్ 370 తిరిగి సాధిస్తాం: మెహబూబా ముఫ్తీ


జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని గతేడాది ఆగస్టు 5న రద్దుచేసిన కేంద్రం.. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కఠిన ఆంక్షలను అమలుచేసింది. ఈ క్రమంలో కశ్మీర్ ప్రాంతానికి చెందిన పలువురు రాజకీయ, వేర్పాటువాద నేతలను గృహనిర్బంధంలో ఉంచింది. ఇప్పటికే నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా ఆయన తనయుడు ఒమర్ అబ్దుల్లాను ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా, మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీని మంగళవారం రాత్రి గృహనిర్బంధం నుంచి విడుదల చేశారు. 14 నెలల తర్వాత ఆమె గృహనిర్బంధం నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా ముఫ్తీ మాట్లాడుతూ... గతేడాది ఆగస్టు 5న జరిగిన అవమానాన్ని తాము మరచిపోలేదని అన్నారు. ఆర్టికల్‌ 370ని చట్ట విరుద్ధంగా కేంద్రం రద్దు చేసిందని, దాన్ని తిరిగి సాధిస్తామని ఉద్ఘాటించారు. అలాగే కశ్మీర్‌ సమస్యను కూడా పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు. అందుకు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని, ఈ మార్గం సులభం కాదని తమకు తెలుసనని, అయినప్పటికీ దానిని ఆపే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. తనను విడుదల చేసినప్పటికీ, ఇప్పటికీ చాలా మంది చట్ట విరుద్ధంగా నిర్బంధంలో ఉన్నారని ఆమె అన్నారు. వారందరిని విడుదల చేయాలని ముఫ్తీ డిమాండ్ చేశారు. కాగా, ముఫ్తీని కొంత కాలం పాటు చెష్మా షాహి అతిథి గృహంలో, అనంతరం ఎంఏ లింక్‌ రోడ్డులోని మరో అతిథి గృహంలో నిర్బంధంలో ఉంచారు. మెహబూబా ముఫ్తీ విడుదలను మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా స్వాగతించారు. ముఫ్తీ నిర్బంధం కొనసాగించడం సిగ్గుచేటని, ఇది ప్రజాస్వామ్య విధానాలకు వ్యతిరేకమని ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. ఏడాదికిపైగా గృహనిర్బంధం తర్వాత మెహబూబా ముఫ్తీ విడుదలవుతున్నట్టు వినడానికి చాలా సంతోషంగా ఉంది.. ఆమె నిర్బంధాన్ని కొనసాగించడం ప్రజాస్వామ్య విధానాలకు పూర్తిగా విరుద్దం.. విడుదలను స్వాగతిస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.


By October 14, 2020 at 11:50AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/revoked-psa-detention-of-former-jammu-and-kashmir-chief-minister-mehbooba-mufti/articleshow/78654959.cms

No comments