Breaking News

రాబోయే రోజుల్లో ఢిల్లీలో కరోనా విజృంభణ.. రోజూ 15వేల కేసులు: హెచ్చరించిన కేంద్రం


రాబోయే రోజుల్లో దేశ రాజధాని ఢిల్లీలో రోజూ 15వేలకుపైగా కొత్త కేసులు కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) హెచ్చరించింది. వచ్చేవి పండగలు సీజన్, శీతాకాలంలో అత్యధిక కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు పేర్కొన్న ఎన్సీడీసీ.. ఇందుకు మూడు కారణాలను వివరించింది. 1) పలు పండగల నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఢిల్లీకి వచ్చేవారికి వ్యాధి సోకడం.. 2) శీతాకాలంలో శ్వాసకోశ సంబంధిత రోగాలు తీవ్రతరం కావడం వల్ల పరీక్షలు నిర్వహించడంతో వ్యాధి నిర్ధారణ కావడం.. 3) వ్యాధి తీవ్రంగా ఉన్న రోగులు రాజధానికి చేరుకోవడం. వీటితో సహా పలు కార్యక్రమాలకు పెద్ద ఎత్తున్న జనం ఒక చోటుకు చేరడంతో కొవిడ్‌ కేసులు విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్ వీకే పాల్‌ పర్యవేక్షణలో ఎన్‌సీడీసీ బృందం ఈ నివేదిక రూపొందించింది. ఢిల్లీలో రోజూ 15 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యే సూచనలు ఉన్నాయని, అందులో 20 శాతం మందికి వ్యాధి తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ఆ 20 శాతం మందిని చికిత్సకు చేర్చుకోవడానికి హాస్పిటల్స్‌లో తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. రాజధానిలో ఇప్పటి వరకు 2,324 మంది ఆరోగ్య సిబ్బంది మహమ్మారి బారినపడ్డారని, వీరిలో వైద్యులు 23 శాతం, నర్స్‌లు 34 శాతం, పారామెడికల్ సిబ్బంది 15 శాతం, గ్రూప్-డి స్టాప్ 18 శాతం, ఇతరులు 10 శాతమని తెలిపింది. మొత్తం 75 మంది వైద్య ఆరోగ్య సిబ్బంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారని, వీరిలో 14 మంది డాక్టర్లు ఉన్నారని వివరించింది. మరోసారి వీరికి కరోనా సోకకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. కేరళలో ఓనమ్, మహారాష్ట్రలో వినాయక చవితి పండుగల సందర్భంగా జనం పెద్ద ఎత్తున గుమిగూడటంతో మహమ్మారి అక్కడ విజృంభిస్తోందని గుర్తుచేసింది. ఢిల్లీలో అటువంటి పరిస్థితి రాకూడదని అప్రమత్తం చేసింది. పరిశుభ్రత, మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరంపై మరింత దృష్టిపెట్టాలని నొక్కిచెప్పింది. శతశాతం మాస్క్‌ల విషయంలో పెద్ద ఎత్తున్న ప్రచారం నిర్వహించాలని పేర్కొంది. వైరస్ కట్టడికి ఇది అత్యంత కీలకమని, దీనిని తప్పనిసరిగా అనుసరించాలని తెలియజేసింది. పండగలను తక్కువ మందితో నిర్వహించుకోవాలని, బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడటాన్ని అరికట్టేలా ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించాలని నివేదిక సూచించింది. ఇప్పటి వరకూ కరోనాతో ఢిల్లీలో 5,401 మంది చనిపోగా.. సెప్టెంబరు 15 నుంచి రోజువారీ సగటు మరణాల రేటు 30 నుంచి 40 శాతంగా ఉంది. దేశం, ప్రపంచంలో ఇతర అనారోగ్య కారణాలతో వయసు మళ్లిన వ్యక్తుల్లో కోవిడ్ మరణాల రేటు 66.6 శాతంగా ఉందని తెలిపింది. ఢిల్లీలో కరోనా మరణాల రేటు (1.9) జాతీయ సగటు (1.5) కంటే ఎక్కువగా నమోదయ్యింది.


By October 10, 2020 at 07:11AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/delhi-may-witness-surge-of-15k-covid-19-cases-per-day-in-winter-says-ncdc-report/articleshow/78584431.cms

No comments