SP Balu: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వ్యక్తిత్వం ఎలాంటిదంటే.. నేనే ప్రత్యక్షసాక్షిని: చాగంటి కోటేశ్వర రావు
గాన గంధర్వుడు (74) తీవ్ర అనారోగ్యంతో నిన్న (సెప్టెంబర్ 25) తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన మరణం యావత్ సినీ ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది. 40 దశాబ్దాల జర్నీలో కొన్ని వేల పాటలు ఆలపించి తన గానామృతంతో సినీ ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన బాలు.. ఇకలేరనే విషయం జీర్ణించుకోలేకపోతున్నారు ఆయన అభిమానులు. మరోవైపు సినీ ప్రముఖులంతా బాలుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో బాలు వ్యక్తిత్వం గురించి ప్రముఖ ప్రవచనకర్త చెప్పిన విషయాల తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బాలు వ్యక్తిత్వంపై చాగంటి ఏమన్నారనేది ఆయన మాటల్లోనే చూస్తే.. ''నేను, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు బెంగుళూరు లోని ఓ సభలో పాల్గొన్నాం. ఇద్దరం పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకుంటూ ఆ కార్యక్రమం నిర్వహిస్తున్న నిర్వాహకులను నా ప్రవచనం ఎన్ని గంటలకు అని అడిగా. దానికి వాళ్ళు బదులిస్తూ మీ ప్రవచనం 4 గంటలకు అని, అంతకుముందు 3 గంటలకు 'పాడుతా తీయగా'లోని చాలామంది పిల్లలు అన్నమాచార్య కీర్తనలు పాడబోతున్నారు అని చెప్పారు. Also Read: దాంతో నేను కూడా 3 గంటలకు వచ్చి స్టేజీ మీద ఓ మూల కుర్చీ వేస్తే కూర్చుంటానని చెప్పి.. మహానుభావుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంక తిరిగి ఆయనతో ఓ మాట చెప్పాను. 'బాలసుబ్రహ్మణ్యం గారు ఆ పిల్లలంతా మీ శిష్యులు కదా..మీరు వృద్ధి లోకి తెచ్చినవాళ్లు కదా.. మీరు కూడా వచ్చి వేదికపై కూర్చుంటే వాళ్ళు పాట పాడటానికి వచ్చినపుడు వేదికపై మిమల్ని చూసి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి సమక్షంలో మేము పాట పాడుతున్నాం అని సంతోష పడతారు. వాళ్ళు వేదిక దిగిపోయాక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి సమక్షంలో పాట పాడమని కొన్ని వందలమంది వారి వారి సన్నిహితులకు చెప్పుకుంటారు. అది వాళ్ళకో మధురానుభూతి అవుతుంది' అని అన్నాను. బాలు గారు ఎంత సహృదయుడంటే.. తప్పకుండా వస్తానని చెప్పి వేదికపై కూర్చొని పిల్లలు పాడుతుంటే చూస్తూ ఎంతో సంతోషపడ్డారు. ఇక అది చూసి ఆ పిల్లలంతా ఆనంద డోలికల్లో తేలిపోయారు. అందులో పాట పాడి వెళ్లిపోతుంటే ఆయన ఒక్కొక్కరినీ పిలిచి.. ఎంత పొడుగైపోయావురా? అప్పుడు పొట్టిగా ఉండేవాడివి అని అంటుంటే వారంతా గజారోహణం చేసినట్లు హద్దుల్లేని ఆనందంతో వేదిక దిగారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి సమక్షంలో పాడుతూ ఆ పిల్లలు పొందిన ఆనందాన్ని ప్రత్యక్షంగా చూశా'' అంటూ గురు శిష్యుల బంధం ఎంత గొప్పదో, అందునా బాలు వ్యక్తిత్వం ఎంత మధురమైందో వివరించారు చాగంటి కోటేశ్వర రావు.
By September 26, 2020 at 10:02AM
No comments