Breaking News

Gangavva: ఆ ఉద్దేశంతోనే గంగవ్వని బిగ్ బాస్‌కి తీసుకొచ్చారు, సెలక్షన్ బాలేదు: కౌశల్ షాకింగ్ కామెంట్స్


ఓడ దాటే వరకు ఓడ మల్లన్న.. ఓడ దాటాక బోడి మల్లన్న అన్నాడట వెనకటికి ఎవడో.. బిగ్ బాస్ సీజన్ 2 విజేత .. బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్‌ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఇలాగే ఉన్నాయి. నిజానికి బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ ఎంపికపై చాలామంది ప్రేక్షకుల్లో అసహనం ఉంది. గత సీజన్లతో పోల్చుకుంటే ఈ సీజన్‌లో 16 మంది కంటెస్టెంట్లలో చాలావరకూ ముక్కుమొహం తెలియని వాళ్లని తీసుకుని వచ్చారని విరక్తి చెందుతున్నారు. అయితే ఆల్ రెడీ సెలబ్రిటీ హోదా వచ్చి కోట్లు గడించి.. కావాల్సినంత పాపులారిటీ, క్రేజ్ ఉన్న వాళ్లని కంటెస్టెంట్‌గా తీసుకువచ్చి వాళ్లని విజేతల్ని చేసి చేతిలో ఓ రూ.50 లక్షలు పెట్టడం కంటే.. బిగ్ బాస్ ద్వారా కొత్త వాళ్లను సెలబ్రిటీ హోదా కల్పించడం అయితే ఆహ్వానించతగ్గ విషయమే. Read also: అయితే తొలి నుంచి బిగ్ బాస్ అంటే అదో సెలబ్రిటీ హౌస్ అనే పేరు ఉంది కాబట్టి.. అలాంటి వాళ్లు ఈ సీజన్‌లో పెద్దగా కనిపించకపోవడంతో ప్రేక్షకులు కాస్త అసహనానికి గురికావడంతో కూడా న్యాయం ఉంది. ఇకపోతే ఈ సీజన్‌లో కంటెస్టెంట్స్ ఎంపిక బాలేదు అంటూ బిగ్ బాస్ సీజన్ 2 విజేత కౌశల్ కామెంట్స్ చేశారు. ఈ సీజ‌న్‌లో అంచనాల‌కు త‌గ్గ‌ట్టుగా పార్టిసిపెంట్ల‌ ఎంపిక జ‌ర‌గ‌లేద‌న్న కౌశల్.. కరోనా వల్ల చాలా మంది సెలబ్రిటీలు బిగ్ బాస్ హౌస్‌కి రావడానికి ఆసక్తి చూపించి ఉండరని.. అందుకే వీళ్లని ఎంపిక చేసి ఉంటారని అభిప్రాయ పడ్డాడు కౌశల్. నిజానికి కౌశల్ బిగ్ బాస్‌కి రాకముందు కూడా పెద్ద సెలబ్రిటీ కాదు.. బిగ్ బాస్‌కి వచ్చిన తరువాతే కౌశల్ ఆర్మీ పేరుతో ప్రేక్షకులు అతనికి బ్రహ్మరథం పట్టడంతో బిగ్ బాస్ విజేతగా అవతరించి సెలబ్రిటీ హోదా దక్కించుకున్నాడు. చక్రవాకం, డాన్స్ బేబీ డాన్స్, సూర్యవంశం సీరియల్స్‌లో నటించిన కౌశల్.. రాజకుమారుడు, శ్రీరాం, వెంకీ తదితర చిత్రాల్లో నటించాడు. అయితే అటు సీరియల్స్ ఇటు సినిమాల్లోనూ నటించినా రాని గుర్తింపును బిగ్ బాస్‌తో అందిపుచ్చుకున్నాడు. ఇక విజేతగా నిలిస్తే తనకు వచ్చిన ప్రైజ్ మనీని కాన్సర్ పేషెంట్లకు ఉపయోగిస్తానని చెప్పిన కౌశల్.. ఆ మాటను నిలుపుకోలేకపోయాడంటూ ఇతనిపై ఆరోపణలు వచ్చాయి. అతని గెలుపులో భాగమైన కౌశల్ ఆర్మీలోకి కొంతమంది సభ్యులే ఇతనిపై ఆరోపణలు చేయడం విశేషం. ఇక ఆ విషయాన్ని పక్కనపెట్టేస్తే.. ఈ సీజన్‌కి సంబంధించి కౌశల్ ఏమన్నారంటే.. ప‌ల్లెల్లో బిగ్‌బాస్ చూసేవారి సంఖ్య‌ను పెంచాల‌నే ఉద్దేశంతోనే గంగవ్వను తీసుకువచ్చారని చెప్పిన కౌశల్.. ఆమె ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయం అన్నాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా.. పల్లెటూరి నుంచి ఓ బామ్మ బిగ్ బాస్‌కి తీసుకురావడం అభినందనీయం అన్నాడు కౌశల్. అయితే గంగవ్వ ఖచ్చితంగా పది వారాలపైనే బిగ్ బాస్ హౌస్‌లో ఉండొచ్చని జోస్యం చెప్పాడు కౌశల్. ఇక సీజన్ 2లో రన్నరప్‌గా నిలిచి తనకు గట్టి పోటీ ఇచ్చిన గీతా మాధురి గురించి మాట్లాడుతూ.. ఫిజికల్ టాస్క్‌లతోనే బిగ్ బాస్ ఫైనల్‌కి చేరతారని తాను అనుకోవడం లేదని.. గతంలో గీతామాధురి ఫిజికల్ టాస్క్‌లలో పార్టిసిపేట్ చేయకపోయినా.. ఫైనల్‌కి చేరిందని అన్నారు కౌశల్. ఇక దర్శకుడు సూర్య కిరణ్ అతిగా ఆవేశపడుతున్నాడని.. తనకే కరెక్ట్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడని.. అతిగా ఆవేశపడితే కెమెరాల్లో పడతాం అనే ఆలోచనతో అలా చేస్తుంటారు కాని.. అన్నివేళ్లల్లో అది వర్కౌట్ కాదంటున్నాడు కౌశల్. అయితే హౌస్‌లో గ్రూప్‌లుగా ఏర్పడి ఒకర్ని టార్గెట్ చేస్తే భారీ మూల్యం చెల్లించుకుంటారని చెప్పిన కౌశల్.. ఇప్పటికే కంటెస్టెంట్స్ పేర్లతో ఆర్మీలు వచ్చేశాయని.. అయితే ఎన్ని ఆర్మీలు వచ్చినా కౌశల్ ఆర్మీ నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ అంటున్నాడు కౌశల్.


By September 11, 2020 at 11:18AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/telugu-bigg-boss-2-winner-kaushal-manda-shocking-comments-on-bigg-boss-telugu-4-contestants/articleshow/78053392.cms

No comments