Breaking News

భారత రాయబారికి వీసా నిరాకరించిన పాక్.. తెగదెంపులకే మెగ్గుచూపుతున్న దాయాది


ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాలకు మరింత అస్థిరపరిచేలా దాయాది వ్యవహరిస్తోంది. భారత దౌత్యాధికారి జయంత్ ఖోబ్రగడేకు పాకిస్థాన్‌ వీసా నిరాకరించింది. ఈ ఏడాది జూన్‌లో ఖోబ్రగడే పేరును అధికారికంగా ప్రతిపాదించిన భారత్.. అదే నెలలో, సిబ్బందిని 50 శాతం తగ్గించాలని కోరడం ద్వారా పాక్‌తో దౌత్య సంబంధాలను మరింత తగ్గించింది. ఖోబ్రగడేకు వీసా నిరాకరిస్తూ పాక్ నిర్ణయం తీసుకోవడం చూస్తే భారత్‌తో మెరుగైన సంబంధాలను కోరుకోవడంలేదని అర్ధమవుతోంది. కశ్మీర్ సమస్యను బూచిగా చూపి అంతర్జాతీయ సమాజం సానుభూతి పొందడానికి పాక్ చేసి ప్రయత్నం విఫలం కావడం ఆ దేశం నైరాశ్యంలో కూరుకుపోయినట్టు ప్రభుత్వం భావిస్తోంది. భారత్ మిషన్ సగానికి తగ్గించడంతో ఖోబ్రగడే సీనియారిటీ విషయంలో పాక్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇస్లామాబాద్‌లో భారత దౌత్యవేత్తల నియామకాన్ని పాకిస్తాన్ నిర్దేశించలేదన్న భారత్.. పరస్పర చర్యలతో స్పందించే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఈ స్థాయిలో దౌత్యవేత్త నియామకాన్ని ఓ దేశం తిరస్కరించడం చాలా అరుదు. 1995 ఐఎఫ్ఎస్ బ్యాచ్‌కు చెందిన ప్రస్తుతం అటామిక్ ఎనర్జీ విభాగం జాయింట్ సెక్రెటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆయన కిర్గిజ్ రిపబ్లిక్‌లో భారత రాయబారిగా పనిచేశారు. అంతకు ముందు రష్యా, స్పెయిన్, కజిక్‌స్థాన్‌లోని భారత రాయబార కార్యాలయాల్లో విధులు నిర్వహించారు. అయితే, గతంలో ఒకసారి పాకిస్థాన్‌‌లో విధులు నిర్వర్తించిన ఖోబ్రగడే‌కు ప్రస్తుతం వీసా నిరాకరించింది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దుచేసి, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టడాన్ని పాక్ జీర్ణించుకోలేకపోతుందని భారత్ బలంగా నమ్ముతోంది. ఈ అంశాన్ని సెప్టెంబరు 25న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో మరోసారి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లేవనెత్తే అవకాశం ఉంది. మానవ హక్కుల కౌన్సిల్‌లో కశ్మీర్ అంశాన్ని పాక్ ప్రస్తావించడానికి ప్రయత్నించగా... భారత్ తిప్పికొట్టింది. ‘మైనారిటీలను నిరంతరం హింసిస్తూ ఉగ్రవాదానికి కేంద్రంగా మారి, ఐక్యరాజ్యసమితి ఆంక్షల జాబితాలో వ్యక్తులకు పెన్షన్లు అందించే ప్రత్యేకతను కలిగిన దేశం మానవ హక్కులపై మాట్లాడుతుంటే భారత్ లేదా ఇతర దేశాలు వినడానికి సిద్ధంగా లేవు.. జమ్మూ కశ్మీర్‌లో మారణహోమానికి పదివేల మంది ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తోంది’అని ఐరాసలో భారత శాశ్వత మిషన్ తొలి సెక్రెటరీ పవన్ బధే దాయాదికి కౌంటర్ ఇచ్చారు.


By September 20, 2020 at 02:06PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-pakistan-relations-ties-set-to-worsen-as-pakistan-blocks-new-indian-envoy/articleshow/78215686.cms

No comments