Breaking News

ఆ దళాలు ఇక సరిహద్దులకే పరిమితం.. కేంద్రం కీలక నిర్ణయం


బీఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ దళాలను పూర్తిగా సరిహద్దు రక్షణకే పరిమితం చేయాలని కేంద్ర భావిస్తోంది. అంతర్గత విధుల నుంచి వీటిని తప్పించి, సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేలా వ్యూహరచన చేస్తోంది. తొలిసారిగా గతేడాది కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో జరిగిన భేటీలో ఈ అంశంపై చర్చించారు. తాజాగా దీనిపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఎన్నికల నిర్వహణ సహా అంతర్గత భద్రతా విధులకు సీఆర్పీఎఫ్‌ దళాలను వినియోగిస్తున్నారు. త్వరలో జరగబోయే బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు, దేశంలో జరిగే ఉప ఎన్నికల్లో ఈ కొత్త ప్రయోగాన్ని అమల్లోకి తెస్తారు. ఇందులో భాగంగా సీఆర్పీఎఫ్‌, రాష్ట్ర పోలీస్ బలగాలను 70:30 నిష్పత్తిలో మోహరించనున్నారు. ఉప ఎన్నికల్లో భద్రత విధులను సీఆర్పీఎఫ్‌కు అప్పగించి, బీఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ వంటి దళాలను క్రమంగా అంతర్గత భద్రత నుంచి ఉపసంహరిస్తామని ఓ సీనియర్‌ అధికారి వెల్లడించారు. ఏటా వేల సంఖ్యలో సరిహద్దు భద్రత దళాలను ఎన్నికల నిర్వహణ, వివిధ రాష్ట్రాల్లో ఎదురయ్యే అంతర్గత శాంతి భద్రతల పరిరక్షణ వంటి విధులకు వినియోగిస్తున్నారు. ఇది సరిహద్దు భద్రతకు ముప్పుగా పరిణమించిడంతో దీన్ని పరిష్కరించాలని కేంద్రం భావిస్తోంది. సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని సంబంధిత విభాగాలకు ఆదేశాలిచ్చారని, మరిన్ని శిబిరాలను ఏర్పాటు చేయాలని సూచించారని అధికారులు వివరించారు. స్వల్ప లోపాలను కూడా గుర్తించడానికి యువ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని హోంశాఖ ఆదేశించింది. సరిహద్దుల వెంబడి పశువులు, నకిలీ నోట్ల అక్రమ రవాణా, స్మగ్లర్లు, అవినీతి అధికారులకు సంబంధించిన కేసులను పరిశీలించడానికి సీబీఐలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించింది. సరిహద్దులను సమర్థంగా రక్షించడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధికి రక్షణ శాఖకు చెందిన డీఆర్‌డీవో, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ వంటి సంస్థలతో సంప్రదింపులు జరపాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలోని ఒక కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ఉగ్రవాదుల చొరబాటు, స్మగ్లింగ్‌కు అనుకూలంగా ఉన్న పొడవైన గడ్డిని నిర్మూలించడానికి వ్యవసాయ నిపుణుల సాయం తీసుకోవాలని సూచించింది. పాకిస్థాన్‌ (3,300 కిలోమీటర్లు), బంగ్లాదేశ్‌ (4,096 కిలోమీటర్లు)తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దుల్లో ... చైనాతో 3,488 కిలోమీటర్ల పొడవునా ఉన్న వాస్తవాధీన రేఖ వద్ద ఐటీబీపీ, నేపాల్‌తో ఉన్న 1,751 కిలోమీటర్లు, భూటాన్‌తో ఉన్న 699 కిలోమీటర్ల సరిహద్దు వద్ద ఎస్‌ఎస్‌బీ దళాలు గస్తీ నిర్వహిస్తున్నాయి. మయన్మార్‌ సరిహద్దుల్లో అసోం రైఫిల్స్‌ విధులు నిర్వహిస్తోంది.


By September 25, 2020 at 08:54AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/centre-plan-to-withdraw-border-guarding-forces-like-bsf-and-itbp-from-internal-security-duty/articleshow/78307743.cms

No comments