టిక్‌టాక్, విచాట్ బ్యాన్: అమెరికావి బెదిరింపు చర్యలంటూ ధ్వజమెత్తిన చైనా
చైనాకు చెందిన టిక్‌టాక్, వీచాట్ యాప్‌లపై నిషేధం విధించిన అమెరికా.. ఇది ఆదివారం నుంచి అమల్లోకి రానుందని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాపై చైనా మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించింది. అమెరికా బెదిరింపు చర్యలకు పాల్పడుతోందని, అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. బెదిరింపు ధోరణి మానుకోవాలని, తప్పుడు చర్యలను నిలుపుదలచేసి, అంతర్జాతీయ నియమాలు, నిబంధనలను పారదర్శకంగా అమలుచేయాలని అమెరికాను కోరుతున్నాం అని చైనా వాణిజ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ విషయంలో అమెరికా ముందుకెళ్లాలని భావిస్తే.. చైనా కంపెనీల చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను కాపాడటానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని వ్యాఖ్యానించింది. మరోవైపు, దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని టిక్‌టాక్, వీచాట్ యాప్‌లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా వాణిజ్య విభాగం వెల్లడించింది. అంతేకాదు, తమ పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని కూడా చైనా సేకరిస్తోందని పేర్కొంది. అయితే, యాజమాన్యం మార్పిడి విషయం పరిష్కారమైతే నిషేధం ఎత్తివేసే అంశాన్ని పరిశీలిస్తామని రోస్ తెలిపారు. ఇప్పటికే డౌన్‌లోడ్ చేసుకున్న వినియోగదారులకు నవంబరు 12 వరకు టిక్‌టాక్ సేవలు అందుబాటులోకి ఉంటాయని, ఆదివారం తర్వాత కొత్తగా డౌన్‌లోడ్, అప్‌డేట్ కుదరదని అమెరికా వాణిజ్య విభాగం తెలిపింది. కరోనా వైరస్‌కు చైనాయే కారణమని ఆరోపిస్తోన్న అమెరికా.. ఆ దేశంపై కారాలు మిరియాలు నూరుతోంది. ఈ నేపథ్యంలో చైనా ఉత్పత్తులు, సంస్థలపై నిషేధానికి నడుంబిగించింది. మరోవైపు, బైట్‌డ్యాన్స్ లిమిటెడ్‌కు చెందిన టిక్‌టాక్ 100 మిలియన్ల అమెరికా పౌరుల సమాచారాన్ని యాక్సిస్ చేస్తున్న నేపథ్యంలో భద్రత నిపుణులు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశారు. చైనా, అమెరికాల మధ్య కొనసాగిన వాణిజ్య యుద్ధానికి ఈ ఏడాది జనవరిలో జరిగిన ఒప్పందంతో తెరపడినా.. పత్రాల్లోని సిరా అరకముందే కరోనా రూపంలో పెద్ద అవాంతరం ఏర్పడింది.
By September 19, 2020 at 01:31PM
No comments