Breaking News

డైమండ్ నౌకలో అదుపులోకి వచ్చిన మంటలు.. సహకరించిన సింగపూర్ బృందం


శ్రీలంక తూర్పు తీరానికి సమీపంలో ఎంటీ న్యూ డైమండ్‌ ఆయిల్‌ ట్యాంకర్‌ నౌకలో చెలరేగిన మంటలు ఎట్టకేలకు అదుపులోకి వచ్చాయి. మంటలు చెలరేగిన 79 గంటల తరువాత పూర్తిస్థాయిలో వాటిని ఆర్పేసినట్లు శ్రీలంక నౌకాదళం వెల్లడించింది. అయితే నౌకలోని ఇంజిన్‌‌ రూమ్‌లో బాయిలర్‌ పేలి ఫిలిప్పీన్స్‌కు చెందిన ఒకరు మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. పూర్తిస్థాయిలో మంటలను అదుపులోకి తేవడానికి సింగపూర్‌ నిపుణుల బృందం సహకారం తీసుకున్నారు. ప్రమాదానికి గురైన ఓడ రవాణాకు ఉపయోగపడుతుందా? లేదా అన్నది ఈ బృందం పరిశీలించనుంది. అనంతరం దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటారు. మొత్తం 2.70 లక్షల మెట్రిక్‌ టన్నుల ముడి చమురుతో కువైట్‌ నుంచి భారత్‌కు బయలుదేరిన ఎంటీ న్యూ డైమండ్‌ నౌక గురువారం అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. దీంతో శ్రీలంక, భారత నౌకాదళాలు రంగంలోకి దిగి మంటలు ఆర్పే పనిలో నిమగ్నమయ్యాయి. నౌకలో మంటలను అదుపుచేయడానికి భారత్ చేసిన సహాయానికి శ్రీలంక కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. నౌకలో మొత్తం 23 మంది సిబ్బంది ఉండగా.. వీరిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌకలు, శ్రీలంక నావికా దళం, భారత దేశం పంపించిన రెండు ఎమర్జెన్సీ టోయింగ్ వెహికల్స్ సహాయక చర్యలను నిర్వహించాయి. శ్రీలంక నావికా దళం కోరిన మీదట తక్షణమే , డోర్నియర్ విమానం ప్రమాదంలో చిక్కుకున్న ఆయిల్ ట్యాంకర్ ఎంటీ న్యూ డైమండ్‌ ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శ్రీలంక తూర్పు తీరంలో 37 నాటికల్ మైళ్ళ దూరంలో శుక్రవారం ఉదయం ఎంటీ న్యూ డైమండ్ ఆయిల్ ట్యాంకర్‌లో పేలుడు సంభవించడంతో, ఈ ప్రమాదం జరిగింది. మంటలను అదుపుచేయడంలో ఐసీజీ నౌక శౌర్య, శ్రీలంక నావికా దళం విజయం సాధించాయి. పోర్టు వద్ద వాటర్ లైన్‌ నుంచి 10 మీటర్ల పైన రెండు మీటర్ల వెడల్పుగల చీలికను గుర్తించారు.


By September 07, 2020 at 10:23AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/indian-naval-ships-srilanka-airforce-fighting-fire-aboard-mt-diamond-and-brought-it-under-control/articleshow/77971324.cms

No comments