Breaking News

ఐదేళ్లలో మోదీ విదేశీ పర్యటన ఖర్చు రూ.517 కోట్లు..


గత ఐదేళ్లలో విదేశీ పర్యటనకు సంబంధించిన వివరాలను కేంద్రం పార్లమెంట్‌లో వెల్లడించింది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2015 నుంచి మోదీ మొత్తం 58 దేశాల్లో పర్యటించారని, ఇందుకు రూ.517.82 కోట్లు ఖర్చయినట్టు తెలిపింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ సహాయమంత్రి వి.మురళీధరన్‌ రాజ్యసభకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. అమెరికా, రష్యా, చైనాల్లో ఐదుసార్లు, సింగపూర్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, శ్రీలంక, యూఏఈ వంటి దేశాల్లో పలుసార్లు పర్యటనకు వెళ్లారని వివరించారు. ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా పలు దేశాల్లో పర్యటించారని, చివరిసారిగా నవంబర్‌ 13,14 తేదీల్లో బ్రెజిల్‌లో పర్యటించిన మోదీ, బ్రిక్స్‌ దేశాల సమావేశంలో పాల్గొన్నారని మంత్రి చెప్పారు. ప్రధాని మోదీ పర్యటనలతో ద్వైపాక్షిక, ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై భారతదేశ దృక్పథాన్ని ఆయా దేశాల అవగాహనను మరింతగా పెంచేందుకు దోహదపడ్డాయని తెలిపారు. మోదీ పర్యటించిన దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు మరింత దృఢమయ్యాయని, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక, రక్షణ రంగాల్లో సహకారం కూడా పెరిగిందని మంత్రి చెప్పారు. వాతావరణ మార్పులతో పాటు సైబర్‌ సెక్యూరిటీ, ఉగ్రవాదం తదితర అనేక అంశాలపై ప్రపంచ స్థాయిలో ఎజెండాను రూపొందించడంలో భారతదేశం సహకారం ఎక్కువగా ఉందని చెప్పారు. జూన్ 15, 2014 నుంచి డిసెంబరు 3, 2018 వరకు ప్రధాని విదేశీ పర్యటనకు రూ.2,000 కోట్లు ఖర్చయ్యిందని డిసెంబరు 2018లో కేంద్రం తెలిపింది. ప్రత్యేక విమానాలు, హాట్‌లైన్ సౌకర్యాలు తదితరాల కోసం ఈ మొత్తం ఖర్చయ్యిందని పేర్కొంది. ప్రత్యేక విమానాల కోసం రూ.429.25 కోట్లు, విమానాల నిర్వహణ కోసం రూ.1,583.18 కోట్లు ఖర్చయినట్టు అప్పటి విదేశాంగ సహాయ మంత్రి వీకే సింగ్ వెల్లడించారు.


By September 23, 2020 at 09:57AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pm-narendra-modi-has-visited-58-nations-since-2015-at-cost-of-517-crore-centre/articleshow/78268476.cms

No comments