సౌదీలో భారతీయుల దీనస్థితి: ఉపాధిలేక భిక్షాటన.. 450 మందిని నిర్బంధించిన అధికారులు
కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన సంక్షోభంతో వేలాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారు. సౌదీ అరేబియాలోని 450 మంది భారతీయ కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్లపై బిచ్చమెత్తుకుంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, బిహార్, ఢిల్లీ, రాజస్థాన్, కర్ణాటక, హరియాణా, పంజాబ్, మహారాష్ట్రలకు చెందిన వీరిలో వర్క్ వీసా గడువు ముగిసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. యాచించడం నేరంగా పరిగణించి సౌదీ అధికారులు అదుపులోకి తీసుకుని, జెడ్డాలోని షుమైసి నిర్బంధ కేంద్రానికి తరలించారని బాధితులు వాపోయారు. నిర్బంధ కేంద్రాల్లో యూపీకి చెందిన 39 మంది, బీహార్‌కు చెందిన 10 మంది, తెలంగాణ ఐదుగురు, నలుగురు చొప్పు మహారాష్ట్ర, జమ్మూ కశ్మీర్, కర్ణాటక, ఏపీకి చెందిన ఒకరు ఉన్నారు. తాము నిస్సాహయ స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎటువంటి నేరం చేయలేదు.. ఉద్యోగాలు కోల్పోవడంతో గత్యంతరం లేని పరిస్థితిలో బిక్షాటన చేశాం.. ఇప్పుడు నిర్బంధ కేంద్రాల్లో మగ్గిపోతున్నాం’ అని ఓ భారతీయుడు వాపోయాడు. గత నాలుగు నెలలుగా దుర్బరమైన జీవితం గడుపుతున్నామని మరో వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఇండోనేసియా, శ్రీలంక కార్మికులను ఆయా దేశాల అధికారులు వెనక్కు తీసుకెళ్లేందుకు సహాయం చేస్తున్నారని, తాము మాత్రం ఇక్కడ చిక్కుకున్నామని కన్నీటిపర్యంతమయ్యాడు. వీసా గడువు ముగిసినా దేశంలో ఉన్నారనే కారణంతో వీరిని నిర్బంధ కేంద్రాలకు తరలించారని సామాజిక కార్యకర్త, ఎంబీటీ నేత అంజాద్ ఉల్లా ఖాన్ అన్నారు. అలాగే, వర్క్ వీసా లేనివారి కూడా నిర్బంధంలోకి తీసుకున్నట్టు వివరించారు. నా సోదరుడు చనిపోయాడు.. అమ్మ పరిస్థితి విషమంగా ఉంది.. తాను భారత్‌కు రావడానికి సాయం చేయాలని ఓ వ్యక్తి వీడియో ద్వారా వేడుకున్నాడు. ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, పౌర విమానయాన మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి, భారత్‌లో సౌదీ రాయబారి అసఫ్ సయ్యద్‌కు వీరి కష్టాల గురించి వివరిస్తూ అంజాద్ లేఖ రాశారు. నిర్బంధ కేంద్రాల నుంచి విడుదలకు సౌదీ ప్రభుత్వాన్ని సంప్రదించి, స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు చేయాలని కోరాడు. ఈ విషయం గురించి జెడ్డాలోని భారత కాన్సులేట్‌ను టైమ్స్ ఆఫ్ ఇండియా సంప్రదించగా ఎటువంటి స్పందన లేదు. సెప్టెంబర్ 17 న విదేశాంగ మంత్రిత్వ శాఖ హెల్ప్‌లైన్ ప్రవాసీ భారతీయ సహాయ కేంద్రం (పిబిఎస్‌కె) అంజాద్ ఉల్లా ఖాన్ విన్నపంపై ట్విట్టర్‌లో స్పందించి, వారి వివరాలను, ఫోన్ నెంబర్లను కోరింది. సౌదీ నుంచి 2.4 లక్షల మంది స్వదేశానికి రావడానికి నమోదు చేసుకోగా, 40,000 మంది మాత్రమే వచ్చారు.
By September 19, 2020 at 02:19PM
No comments