రాజస్థాన్: చంబల్ నదిలో పడవ మునక.. నలుగురు మృతి, మరో 10 మంది గల్లంతు

రాజ్‌స్థాన్‌లో బుధవారం ఉదయం ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. కోటా సమీపంలోని చంబల్ నదిలో 50 మందితో వెళ్తోన్న ఓ పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 10 మంది గల్లంతయ్యారు. ఇప్పటి వరకు 25 మందిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు. మిగతావారి కోసం నదిలో గాలిస్తున్నారు. ఘటనా స్థలిలో ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద సమయానికి పడవలో 50 మంది వరకు ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. కమలేశ్వర్ ధామ్‌కు వెళ్తుండగా గోథ్లా కాలా వద్ద ఈ ప్రమాదంలో సంభవించింది. ఖతోలి- ఎటావా పట్టణం మధ్యలో ఉన్న దాటడానికి ఆ ప్రాంతవాసులు పడవలను ఆశ్రయిస్తారు. తమతోపాటు బైక్‌లను కూడా పడవల్లోనే తరలిస్తారు. ప్రస్తుతం ప్రమాదం జరిగే సమయంలో 14 బైక్‌లు పడవలో ఉన్నట్టు తెలుస్తోంది. పడవ ప్రమాదం గురించి తెలుసుకున్న స్థానికులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అధికారులకు సమాచారం అందడంతో ఎన్డీఆర్ఎఫ్ దళాలు అక్కడకు చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేశాయి. బరువు ఎక్కువ కావడం వల్లే పడవ మునిగిపోయినట్టు భావిస్తున్నారు. ఇందులో మహిళలే ఎక్కువ మంది ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదం గురించి లోక్‌సభ స్పీకర్ కార్యాలయం ఆరా తీసింది. స్పీకర్ ఓం బిర్లా పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులు ఆదేశించింది.
By September 16, 2020 at 11:38AM
No comments