Breaking News

దేశంలో కరోనా వైరస్.. కొత్త ప్రాంతాలకు కోవిడ్ హాట్‌స్పాట్స్


దేశంలో కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటి వరకూ వైరస్ హాట్‌స్పాట్స్‌గా ఉన్న ప్రధాన నగరాల నుంచి మహమ్మారి చుట్టుపక్కల జిల్లాలు, కొత్తగా ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తోంది. ఇటీవల సోలాపూర్, థానే, నాసిక్, పాల్ఘర్, సూరత్, జలగావ్, దక్షిణ కన్నడ జిల్లాల్లోని కంటెయిన్‌మెంట్ జోన్‌లలో ఒక్క రోజులో 1,000కిపైగా కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు, అధికారిక లెక్కల ప్రకారం.. అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతాలు, గోవా, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి వంటి రాష్ట్రాల్లో ప్రతి 10 లక్షల మందిలో 190- 249 మందికి వైరస్ నిర్ధారణ అవుతోంది. జులై 30 నుంచి యాక్టివ్ కేసులు పుణే, బెంగళూరు, థానే, ముంబయి, చెన్నై, తూర్పు గోదావరి వంటి జిల్లాలు టాప్ 20లో ఉన్నాయి. ‘నిర్దారణ పరీక్షలు పెంచడం, బాధితులు త్వరగా కోలుకోవడంతో యాక్టివ్ కేసులు తగ్గుముఖం పట్టడం సానుకూలంశం.. కానీ, వైరస్ దేశంలోని వివిధ ప్రాంతాలలో వివిధ దశలలో ఉంది.. దీనిని కట్టడి చేయడానికి నిర్దిష్ట ప్రతిస్పందన అవసరం, ముఖ్యంగా నగరాలు, జిల్లాలకు ముప్పు సంకేతాలు వెలువడుతున్నాయి’ అని అధికార వర్గాలు తెలిపాయి. బీహార్, ఒడిశా, తూర్పు యూపీ, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితులు దారుణంగా ఉన్నాయి.. ముమ్మర పరీక్షలు, త్వరగా కాంటాక్ట్ ట్రేసింగ్ చేపట్టకపోతే కేసుల సంఖ్య భారీగా పెరుగుతుందని అధికార వర్గాలు హెచ్చరిస్తున్నాయి. కేంద్రం నుంచి స్పష్టమైన సూచనలు ఉన్నప్పటికీ ఈ రాష్ట్రాల్లో పరీక్షలు పెంచకపోవడం వల్ల పాజిటివ్ రేటు ఎక్కువగా ఉందని ఆరోగ్య శాఖ వర్గాలు పేర్కొన్నాయి. భారత్ సరైన సమయంలో స్పందించి, వైరస్ కట్టడికి వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో మూడు రాష్ట్రాల్లో 50 శాతం కేసులు, 32 శాతం ఏడు రాష్ట్రాల్లోనే ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ గురువారం అన్నారు. ‘కోవిడ్ -19 విషయంలో బహుళ-స్థాయి ప్రతిస్పందన కారణంగా అధిక జన సాంద్రత, తక్కువ జీడీపీ వ్యయం ఉన్నప్పటికీ ప్రతి మిలియన్‌కు కేసులు, మరణాలు తక్కువగానే నమోదయ్యాయి’ అని అన్నారు.


By August 07, 2020 at 07:34AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-hotspots-shift-to-newer-areas-states-as-covid-cases-rise/articleshow/77404734.cms

No comments