Breaking News

కుల్‌భూషణ్ జాదవ్ కేసు: లాయర్ నియమాకంపై పాక్ పిల్లిమెగ్గలు


తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలతో భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌కు సైనిక కోర్టు మరణ శిక్ష విధించగా.. దీనిని అంతర్జాతీయ న్యాయస్థానం నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ కేసులో జాదవ్ తరఫున లాయర్‌ను నియమించేందుకు పాకిస్థాన్ సమాచారం ఇచ్చినా భారత్ స్పందించలేదంటూ పాక్ మీడియాలో గురువారం జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన భారత్.. ఈ కేసులో న్యాయవాది నియామకం గురించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని భారత్‌ స్పష్టం చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘కుల్‌భూషణ్ జాదవ్ కేసుకు సంబంధించి పాకిస్థాన్‌ నుంచి మాకు ఎలాంటి సమాచారం రాలేదు. పాక్‌ ఎటువంటి అడ్డంకులు సృష్టించకుండా లాయర్‌ను నియమించుకునేందుకు అనుమతించాలి’ అని శ్రీవాస్తవ తెలిపారు. ‘ఐసీజే తీర్పును సమర్థవంతంగా అమలు విషయంలో ప్రాథమిక సమస్యలను పాకిస్థాన్ పరిష్కరించాల్సిన అవసరం ఉంది.. దీనికి సంబంధించి పత్రాలను తమకు అందుబాటులో ఉంచడం, సహా ఎటువంటి ఆటంకం లేకుండా సహకరించాలి’ అని శ్రీవాస్తవ అన్నారు. ఈ కేసులో కొద్ది రోజుల కిందట ఇస్లామాబాద్ హైకోర్టు జాదవ్ తరఫున లాయర్‌ను నియమించేందుకు అనుమతిస్తూ తీర్పునిచ్చింది. దీనిపై భారత్‌కు సమాచారం అందజేయాలని పాక్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే లాయర్‌గా నియమించే వ్యక్తి పాక్ పౌరుడై ఉండాలని షరతు విధించింది. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాల మేరకు మిలటరీ కోర్టు ఇచ్చిన తీర్పును సివిల్‌ కోర్టులో సమీక్షించే అవకాశాన్ని తీసుకొస్తూ ఇటీవల పాక్‌ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. దీనిపై ప్రభుత్వం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కుల్‌భూషణ్ కేసులో మూడో కాన్సులర్ యాక్సెస్ ఇవ్వడానికి పాక్ ముందుకొచ్చింది. అంతకు ముందు, రెండో కాన్సులర్ యాక్సెస్ తరువాత అంతర్జాతీయ ట్రైబ్యునల్ తీర్పును పాకిస్థాన్ ఉల్లంఘించిందని భారత్ ఆరోపించింది. అడ్డంకులు, అవాంతరాలు లేకుండా బేషరతుగా జాదవ్‌ను కలిసేందుకు అవకాశం కల్పించలేదని ఆరోపించింది. అంతేకాదు జాదవ్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు కూడా పేర్కొంది.


By August 07, 2020 at 08:11AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pakistan-invites-india-for-appointing-lawyer-for-kulbhushan-jadhav-case-reports/articleshow/77404990.cms

No comments