Breaking News

సరిహద్దుల్లో ప్రతిష్టంభనపై చర్చలు.. చైనా దారికి వస్తుందని బలంగా నమ్ముతున్న భారత్


సరిహద్దుల్లో భారత్, చైనాల మధ్య కొనసాగుతోన్న ప్రతిష్టంభనపై నాలుగో దశ దౌత్యపరమైన చర్చలు గురువారం జరిగిన విషయం తెలిసిందే. ఈ చర్చల తర్వాత ఉద్రిక్తతలు తగ్గించడానికి చైనా ప్రయత్నిస్తుందని భారత్ గట్టి నమ్మకంతో ఉంది. గురువారం నాటి సమావేశం ఉపయోగకరంగా ఉంటుందని, కొంత పురోగతికి దారితీస్తుందని ఆశిస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. భారత్-చైనా సరిహద్దు వ్యవహారాల (డబ్ల్యుఎంసిసి)పై సంప్రదింపులు, సమన్వయం కోసం గురువారం ఇరు దేశాల అధికారులు సమావేశమయ్యారు. ఇది 18వ డబ్ల్యుఎంసీసీ సమావేశం కాగా, తూర్పు లడఖ్‌లో ప్రతిష్టంభన మొదలైన తర్వాత నాలుగోది. ఈ సమావేశం ఎందుకూ ఉపయోగపడలేదని చెప్పడం తప్పు.. గురువారం ఒక ఉపయోగకరమైన సమావేశం జరిగిందని, ఇది సైన్యం వెనక్కు మళ్లింపు ప్రక్రియను ముందుకు తీసుకువెళుతుందని ఆశిద్దామని అధికార వర్గాలు వ్యాఖ్యానించాయి. భారత్ పేర్కొన్నట్టుగా విదేశాంగ మంత్రులు, ప్రత్యేక ప్రతినిధుల మధ్య కుదిరిన ఒప్పందాల ప్రాముఖ్యతను చర్చలలో ఇరుపక్షాలు నొక్కిచెప్పాయి. పాంగాంగ్ సరస్సు, గోగ్రా హాట్‌స్ప్రింగ్స్, కొన్ని ఇతర ప్రాంతాల నుంచి సైన్యం వైదొలగలేదని ధ్రువీకరించగా, చైనా దళాలతో ఈ అవగాహన ఇంకా అమలులోకి రాలేదు. దెప్సాంగ్-దౌలత్ బేగ్ ఓల్డీ ప్రాంతాల్లోనూ ప్రత్యర్ధి సైనిక నిర్మాణాలు నిలిపివేసే ప్రయత్నాలు కూడా విజయవంతం కాలేదు. సీనియర్ కమాండర్ల మధ్య ఐదు రౌండ్ల చర్చలు జరిగినప్పటికీ ఈ ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌కు ముందున్న యథాతథ స్థితిని పునరుద్ధరించాలని చైనాను భారత్ కోరింది. ఇక్కడ ఆసక్తికర విషయమేంటంటే సమావేశాల్లో భారత్ మాదిరిగా కాకుండా చైనా పూర్తిగా సైన్యాన్ని వెనక్కు మళ్లించే అంశాన్ని ప్రస్తావించలేదు. బలగాల ఉపసంహరణకు భారత్, చైనాలు విస్తృత సూత్రాలపై అంగీకారానికి వచ్చి, కొంత పురోగతి సాధించినట్టు ప్రభుత్వం చెబుతోంది. సైన్యం మళ్లింపు అంశాన్ని భారత్ నొక్కిచెప్పినప్పటికీ, పరస్పరం అంగీకార చర్య ద్వారా మాత్రమే ఇది సాధ్యమని, ఈ ప్రక్రియ సంక్లిష్టంగా ఉందని ప్రభుత్వం గ్రహించింది.


By August 22, 2020 at 09:18AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/lac-situation-talks-useful-india-hopes-to-see-progress/articleshow/77687134.cms

No comments