Breaking News

గుడ్ న్యూస్.. ఈ విటమిన్‌తో కరోనా నుంచి త్వరగా ఉపశమనం.. అధ్యయనంలో వెల్లడి


కరోనా బారిన పడినవారు త్వరగా కోలుకోవడానికి విటమిన్-సి, విటమన్-డి దోహదం చేస్తాయనేది నిపుణుల మాట. అందుకే కరోనా బారిన పడిన వారికి అజిత్రోమైసిన్, జింకోవిట్, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌తోపాటు విటమిన్-సి బిళ్లలను కూడా ఇస్తున్నారు. ముందు జాగ్రత్తగా చాలా మంది నిమ్మ జాతి పండ్లను ఆహారంలో భాగంగా చేసుకుంటున్నారు. విటమిన్ డి కోసం ఉదయాన్నే ఎండలో నిలబడుతున్నారు. కాగా కరోనాపై పోరాటంలో మరో విటమిన్ కూడా ఎంతో ప్రయోజనకారిగా ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కరోనా బారిన పడిన వారిలో రోగ నిరోధక వ్యవస్థ ఓవర్ రియాక్ట్ అవుతోంది. ఇలా జరగకుండా ఆరోగ్యకరమైన రోగ నిరోధక వ్యవస్థ కొనసాగడంలో.. వ్యాధి లక్షణాలను తగ్గించడంలో విటమిన్-బి సాయపడుతోందని పరిశోధకులు గుర్తించారు. పేషెంట్లకు అందిస్తోన్న చికిత్సతోపాటు.. విటమిన్-బి గురించి కూడా అంచనా వేయాలని సూచిస్తున్నారు. కణాల పనితీరు, శక్తి జీవక్రియ, రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పని చేయడంలో ‘’ కీలక పాత్ర పోషిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. సహజ నిరోధక శక్తిని పెంచడం, సైటోకైన్ స్థాయిలను తగ్గించడం, శ్వాస వ్యవస్థ పనితీరు మెరుగుపర్చడంలో విటమిన్-బి తోడ్పడుతుందని పరిశోధకులు తేల్చారు. మంట, ఇతర ఇబ్బందులను తగ్గించడం వల్ల పేషెంట్ హాస్పిటల్‌లో ఉండే సమయాన్ని తగ్గిస్తున్నట్లు అధ్యయనంలో గుర్తించారు. మటురియాస్ అనే జర్నల్‌లో ఈ అధ్యయనం ఈ వారం ప్రచురితమైంది. కానీ ఈ రీసెర్చ్ కోసం పేషెంట్లకు ప్రత్యేకంగా బి-విటమిన్‌ను అందించలేదు. దీంతో కోవిడ్ పేషెంట్లు వైరస్ నుంచి కోలుకోవడానికి విటమిన్-బి ఉపయోగపడే విషయమై మరింత లోతుగా పరిశోధన చేయాలని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, యూఏఈ, మెల్‌బోర్న్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అభిప్రాయపడ్డారు. విటమిన్-బి లభ్యమయ్యే ఆహార పదార్థాలు.. బి1 (థయమిన్), బి6, బి12, ఫోలిక్ యాసిడ్ సహా.. మొత్తం 8 రకాల బి విటమన్లు ఉంటాయి. విటమిన్ బి12, బి6 లోపం వల్ల రక్తహీనత తలెత్తుతుంది. పుట్టబోయే పిల్లలో మెదడు, వెన్నెముక సంబంధ లోపాలు తలెత్తకుండా గర్భిణులకు ఫోలిక్ యాసిడ్ ట్యాబెట్లను ఇస్తుంటారు. చేపలు, కోడి గుడ్లు, చికెన్, పాల ఉత్పత్తులు, ఆకు పచ్చని కూరగాయలు, బీన్స్, బఠాణీలు, తృణ ధాన్యాలు, బ్రెడ్‌లో విటమిన్-బి ఎక్కువగా ఉంటుంది.


By August 29, 2020 at 12:56PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/vitamin-b-could-potentially-reduce-covid-19-symptoms-says-study/articleshow/77818546.cms

No comments