Breaking News

హిరోషిమా డే: నాటి ఘోరానికి 75 ఏళ్లు.. ప్రతీకారేచ్ఛతో పాపం మూటగట్టుకున్న అమెరికా


అణుబాంబును సమయంలో తొలిసారి ప్రయోగించారు. సరిగ్గా 75ఏళ్ల కిందట ఇదే రోజు (1945 ఆగస్టు 6న) జపాన్‌లోని హిరోషిమా నగరంపై అమెరికా అణు బాంబు జారవిడిచింది. ఈ బాంబు పేలిన కాసేపటికే 5 చ.కి.మీ. పరిధిలోని ప్రాంతం సర్వనాశనమైంది. ఈ బాంబు దాడి జరిగిన వెంటనే 80 వేల మంది ప్రాణాలు కోల్పోగా, 35 వేల మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయాలు, అణుధార్మికత ప్రభావంతో ఈ ఏడాది చివరి నాటికి మరో 60 వేల మందితో కలిపి మొత్తం 1,40,000 మంది చనిపోయారు. 15 కిలోల టన్నుల (లిటిల్ బాయ్) బాంబు పడగానే జపాన్ మొత్తం భూకంపం వచ్చినట్లు వణికిపోయింది. సుమారు 12,500 టన్నుల టీఎంటీతో సమానమైన శక్తి ఉత్పన్నమైంది. అక్కడి ఉష్ణోగ్రత 10 లక్షల సెంటీగ్రేడ్‌కు చేరుకుంది. మనుషులంతా క్షణాల్లో మసైపోయారు. కాలిన గాయాలు, రేడియేషన్ వల్ల జీవచ్ఛవాలయ్యారు. పెరల్ హార్బర్‌పై జపాన్ ఆకస్మిక దాడికి అమెరికా ప్రతీకారం తీర్చుకున్నా.. లక్షలాది మంది ప్రాణాలు హరించిన పాపం మాత్రం ఆ దేశాన్ని ఇంకా వెంటాడుతూనే ఉంది. హిరోషిమా అంటే జపనీస్ బాషలో విశాలమైన దీవి అని అర్థం. దీవుల సమాహారమైన జపాన్‌లోని అతిపెద్ద దీవిలో ఉన్న పెద్ద నగరం ఇది. అమెరికా వైమానిక దళానికి చెందిన‘ఎనోలా గే’ అనే విమానం ద్వారా లిటిల్ బాయ్ అనే అణు బాంబును ఆగస్టు 6 ఉదయం 8.15 గంటలకు హిరోషిమాపై జారవిడిచారు. ఈ బాంబును మోసుకెళ్లిన విమానంలో ముగ్గురు సిబ్బంది మాత్రమే ఉన్నారు. యురేనియం ఆధారితమైన ఈ అణుబాంబు బరువు 9 వేల పౌండ్లు, పొడవు 10 అడుగులు. ఈ బాంబు నేలను తాకడానికి ముందే, 1750 అడుగుల ఎత్తులోనే పేలింది. బాంబు దాడికి ముందు హిరోషిమా జనాభా దాదాపు 3.4 లక్షలు కాగా, తర్వాత అది 1.37 లక్షలకు పడిపోయింది. అణు బాంబు దాడికి గురైన తర్వాత హిరోషిమాలో పూసిన తొలి పుష్పం ఓలియెండర్. అందుకే దీన్ని హిరోషిమా నగర అధికారిక పుష్పంగా ప్రకటించారు. బాంబు పేలిన ప్రాంతానికి కిలోమీటర్ దూరంలో పెరుగుతున్న ఆరు గింక్గో చెట్లు అణు విధ్వంసాన్ని తట్టుకొని మనుగడ సాగించాయి. రేడియేషన్ ప్రభావం నుంచి వేగంగా తేరుకొని తిరిగి చిగురించాయి. వీటిని సజీవ శిలాజాలు అంటారు. సిటీలోని ట్రామ్ వ్యవస్థ బాంబు దాడి తర్వాత కూడా పని చేసింది. గాయపడిన వారిని అందులో తరలించారు. వాటిలో కొన్ని నేటికీ పని చేస్తున్నాయి.


By August 06, 2020 at 11:07AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/japans-city-hiroshmia-marks-75th-anniversary-of-worlds-first-atomic-bomb-attack/articleshow/77386653.cms

No comments