ఆగస్టు 31 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం
కట్టడికి విధించిన లాక్‌డౌన్ కారణంగా మార్చి 22 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం కొనసాగుతోంది. తాజాగా, మరో నెల రోజుల పాటు ఆగస్టు 31 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. దేశీయ విమాన ప్రయాణాలను మే 25 నుంచి పునరుద్దరించినా, అంతర్జాతీయ సర్వీసులను మాత్రం ప్రారంభించలేదు. గతంలో విధించిన ఈ నిషేధం జులై 31తో ముగిసింది. కేవలం ప్రయాణికుల విమానాలపై మాత్రమే నిషేధం కొనసాగుతుందని, సరకు రవాణా, డీజీసీఏ ఆమోదం తెలిపిన సర్వీసుల నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని అధికారిక ప్రకటనలో పేర్కొంది. అంతర్జాతీయ విమానా సర్వీసులు నిలిచిపోవడంతో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు వందే భారత్ మిషన్ ద్వారా 2,500పైగా ప్రత్యేక విమానాలు నడిపటానికి అనుమతి ఇచ్చినట్టు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘వందే భారత్ మిషన్’ కింద ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లు మే 6 నుంచి జులై 30 మధ్య కాలంలో 2,67,436 మందిని, ఇతర అద్దె విమానాల ద్వారా 4,86,811 మందిని తరలించినట్లు పేర్కొంది. కోవిడ్ నేపథ్యంలో ప్రయాణికుల విమానాలను క్రమంగా అనుమతించడంలో భాగంగా అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, కువైట్‌లతో ‘ట్రావెల్ బబుల్’ ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు తెలిపింది. మరిన్ని దేశాలతో ఇలాంటివి ఖరారు చేయాల్సి ఉందని వివరించింది. ఇటువంటి ద్వైపాక్షిక ఒప్పందాల వల్ల రెండు దేశాల మధ్య కొన్ని నిబంధనలకు లోబడి విమాన సర్వీసులను నడపడానికి అవకాశం ఉంటుంది. బ్రిటన్, కెనడా వంటి దేశాలతోనూ ట్రావెల్ బబుల్ ఒప్పందానికి చర్చలు జరుగుతున్నాయి. దేశీయ విమాన సర్వీసులు 50 శాతానికి చేరితే అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది. మే 25 నుంచి 30 శాతం సర్వీసులు ప్రారంభం కాగా.. వీటిని నవంబరు 24 నాటికి 45 శాతానికి పెంచాలని నిర్ణయించింది. మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టి, విమాన సర్వీసులపై రాష్ట్రాలు ఆంక్షలను సడలించిన దాన్ని బట్టి పరిస్థితి ఆధారపడి ఉంటుంది.
By August 01, 2020 at 11:03AM
No comments