Breaking News

దేశంలో డిసెంబరు 3 నాటికి కోవిడ్ తగ్గుముఖం.. ఇండియాా ఔట్ బ్రేక్ నివేదిక!


దేశంలో మహమ్మారి స్వైరవిహారం కొనసాగుతుండగా.. ఇండియా ఔట్ బ్రేక్ విడుదల చేసిన నివేదిక కొంత ఊరట కలిగించేలా ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు 29 లక్షలు దాటగా, మహమ్మారి నుంచి విముక్తి ఎప్పుడు లభిస్తుంది? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందనే ఆందోళన ప్రజల్లో నెలకుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 3 నాటికి భారత్‌లో వైరస్ తిరోగమన దశలో ఉంటుందని ఐఓఆర్ నివేదిక వెల్లడించింది. సెప్టెంబర్ తొలివారానికి కేసుల పెరుగుదల గరిష్ణానికి చేరుతుందని అంచనా వేసింది. ఆ సమయానికి యాక్టివ్ కేసుల సంఖ్య 7.80 లక్షలుగా ఉంటాయని, ఆ తరువాత వైరస్ తగ్గుముఖం పడుతుందని అంచనా వేసింది. సెప్టెంబర్ తొలి రెండు వారాల్లో వైరస్ తీవ్ర స్థాయిలో ఉంటుందని, ఆ తరువాత మరో 15 రోజులకు హాట్‌స్పాట్స్‌లోనూ తగ్గుముఖం ప్రారంభమవుతుందని పేర్కొంది. తొలినాళ్లలో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో కేసుల సంఖ్య ప్రస్తుతం తగ్గిన నేపథ్యంలో, ఐఓఆర్ అంచనాలపై ఆశలను పెంచుతున్నాయి. ఢిల్లీలో 58 లక్షల మందిలో కరోనా యాంటీ బాడీలు అభివృద్ధి చెందాయని ఇటీవల సెరలాజికల్ సర్వే వెల్లడించిన సంగతి తెలిసిందే. వైరస్ ఎదుర్కునే శక్తి భారతీయుల్లో పెరుగుతోందని, నవంబర్ నాటికి ముంబయి కరోనా నుంచి బయట పడవచ్చని, అక్టోబర్ చివరి నుంచి చెన్నైలో వ్యాధి తగ్గుముఖం పడుతుందని ఈ తాజా నివేదిక వివరించింది. ఆగస్టు నెలాఖరుకు బెంగళూరులో కేసులు గరిష్ఠానికి చేరుకుంటాయని, ఆపై నవంబరు రెండో వారం తరువాత తగ్గుముఖం పడతాయని పేర్కొంది. మహా నగరాల్లో కేసుల సంఖ్య తగ్గుతూ, పట్టణాలు, గ్రామాల్లో పెరుగుతున్నందున, ఇకపై మధ్య, చిన్న శ్రేణి పట్టణాలపై ప్రభుత్వాలు దృష్టిని సారించాలని సూచించింది. ఇండోర్, థానే, తిరువనంతపురం, సూరత్, జైపూర్, నాసిక్ వంటి టైర్-2, 3 నగరాల్లో ప్రస్తుతం కేసుల సంఖ్య పెరుగుతోందని గుర్తు చేసిన ఐఓఆర్ నివేదిక, నవంబరు మూడో వారం నుంచి ఈ ప్రాంతాల్లో కూడా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుందని తెలిపింది. ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాపిస్తున్న రేటు కూడా తగ్గుతోందని గుర్తు చేసింది. మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి రేటు 1.24కు చేరిందని, తెలంగాణలోనూ ఇవే సంకేతాలు వెలువడటం వైరస్ నుంచి భారత్ బయట పడనుందనే బలమైన అంచనాలు పంపుతోందని చెప్పింది. కరోనా కట్టడికి కేరళ తీసుకున్న చర్యలు ప్రశంసలందుకోగా.. అంతర్-రాష్ట్ర ప్రయాణాలు పునఃప్రారంభం, విదేశాల నుంచి ప్రవాసీలు తిరిగి వచ్చిన తరువాత వ్యాప్తి తిరిగి పుంజుకుందని తెలిపింది. మ్యాథ్‌మెటికల్ మోడల్ ఆధారంగా ఈ నివేదికను ఐఓఆర్ రూపొందించింది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో క్రమంగా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని పేర్కొంది. ప్రస్తుతం దేశంలోనే అత్యధికంగా కర్ణాటకలో వ్యాప్తి రేటు 1.44 ఉండగా.. దీని తర్వాత తమిళనాడు (1.35 శాతం) ఉంది. రాజస్థాన్, ఢిల్లీ లో అత్పల్పంగా 1.06, 1.10గా ఉన్నట్టు వివరించింది.


By August 21, 2020 at 09:04AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/dec-3-end-date-for-coronavirus-focus-on-smaller-cities-and-other-takeaways-from-india-outbreak-report/articleshow/77667119.cms

No comments