ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ప్రయోగాల్లో పురోగతి.. సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి!
ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారికి వ్యాక్సిన్ అభివృద్ధిలో కీలక పురోగతి సాధించింది. ఈ విషయంలో బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు ముందడుగు వేశారని డెయిలీ టెలిగ్రాఫ్ పత్రిక కథనం తెలిపింది. ఆక్స్‌ఫర్ వర్సిటీ రూపొందించిన వ్యాక్సిన్‌తో కరోనా వైరస్ నుంచి ‘రెట్టింపు రక్షణ’ లభిస్తుందని మానవులపై నిర్వహించిన తొలి దశ క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది. వ్యాక్సిన్ ప్రయోగించిన వాలంటీర్ల నుంచి నమూనాలను సేకరించి పరిశీలించిన శాస్త్రవేత్తలు.. యాంటీ బాడీలతోపాటు వైరస్ హంతక ‘టి కణాల’ను ఉత్పత్తి చేసినట్టు గుర్తించారు. శరీరాన్ని ఈ టీకా ప్రేరేపిస్తున్నట్లు ఈ నమూనాలు చెబుతున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ‘ఇది చాలా కీలకాంశం. యాంటీబాడీలు కొద్ది నెలల్లోనే సమసిపోతాయని, టి కణాలు మాత్రం ఏళ్ల తరబడి రక్తంలో ఉంటాయని విడిగా చేసిన అధ్యయనాల్లో వెల్లడయ్యింది. పరీక్ష ఫలితాలు ఆశాజనకంగానే ఉన్నప్పటికీ ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్.. కరోనా వైరస్ నుంచి సుదీర్ఘకాలం రక్షణ కల్పిస్తుందని ఇంకా రుజువు కాలేదు. అయితే ఇది టి కణాలను, యాంటీబాడీ ప్రతిస్పందనను ఉత్పత్తి చేయడం వల్ల కరోనా వైరస్ నుంచి మరింత రక్షణ లభించే అవకాశం ఉంది. వ్యాక్సిన్ ప్రయోగంలో ఇంకా చాలా ప్రయాణం ఉంది’ అని వివరించాయి. వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతించిన బెర్క్‌షైర్ పరిశోధక నైతిక విలువల కమిటీ ఛైర్మన్ డేవిడ్ కార్పెంటర్ మాట్లాడుతూ.. ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ అభివృద్ధి ప్రక్రియ సరైన దిశలో సాగుతుందని అన్నారు. అయితే ఎప్పటిలోగా ఇది వస్తుందనేది ఎవరూ చెప్పలేరని, కొన్నిసార్లు అనూహ్య పరిణామాలు ఎదురుకావొచ్చన్నారు. అయితే అతిపెద్ద ఔషధ సంస్థతో కలిసి పనిచేయడం వల్ల సెప్టెంబరు నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి రావొచ్చని, ఈ లక్ష్యం దిశగానే ఆక్స్‌ఫర్డ్ శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారని డేవిడ్ వ్యాఖ్యానించారు. సీహెచ్‌ఏడీఓక్స్1 ఎన్‌కోవ్-19 అనే ఈ టీకాను ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని జెన్నర్ ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేస్తోంది. దీనికి బ్రిటన్ ప్రభుత్వం, ఆస్ట్రాజెనెకా ఫార్మాలు సహకారం అందిస్తున్నాయి. వ్యాక్సిన్‌పై మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయని, ఈ దశలో వేలాది మందికి ఈ వ్యాక్సిన్‌ను ఇచ్చి, దాని సమర్థతను పరిశీలిస్తామని ఆస్ట్రాజెనెకా ఇటీవల తెలిపింది.
By July 17, 2020 at 08:30AM
No comments