Breaking News

రాముడు భారతీయుడు కాదు నేపాలీ.. అయోధ్య మా దేశంలోనే ఉంది: నేపాల్ ప్రధాని


భారతీయుడు కాదు నేపాలీ అంటూ ప్రధాని కేపీ ఓలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంత కాలంగా భారత్‌ను టార్గెట్ చేసుకున్న ఆయన.. భారతీయుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారు. అసలైన అయోధ్య భారత్‌లో కాదు తమ దేశంలో ఉందన్నారు. రాముడి జన్మస్థలమైన అయోధ్య ఉత్తరప్రదేశ్‌లో లేదని.. దక్షిణ నేపాల్‌లోని థోరీలో ఉన్న వాల్మికీ ఆశ్రమంలో సమీపంలో ఉందని ఓలీ వ్యాఖ్యానించారు. నేపాల్ కవి భానుభక్త జయంతి సందర్భంగా ఖాట్మాండులోని ప్రధాని నివాసంలో ప్రసంగించిన ఓలీ.. నేపాల్ సాంస్కృతిక దురాక్రమణకు బాధితురాలైందన్నారు. నేపాల్ చరిత్రను మార్చేశారని ఆరోపించారు. 1814లో పశ్చిమ నేపాల్‌లోని తన్హూలో జన్మించిన భానుభక్త వాల్మికీ రామాయణాన్ని నేపాలీ భాషలోకి అనువదించారు. ఆయన 1868లో మరణించారు. అయోధ్య థోరీలో ఉన్నప్పటికీ.. భారత్ మాత్రం తమ దేశంలో రాముడి జన్మస్థలం ఉందని పేర్కొంటోందంటూ ఓలీ వ్యాఖ్యానించారు. వాల్మికీ ఆశ్రమం కూడా నేపాల్‌లో ఉంది. పుత్రుల కోసం దశరథుడు యాగం నిర్వహించిన చోటు రిధి, ఇది కూడా నేపాల్‌లోనే ఉందని ఓలీ వాదించారు. అసలు అయోధ్య భారత్‌లో కాదు నేపాల్‌లో ఉందని ఆయన వాదించారు. హిందువుల మనో భావాలు దెబ్బతీసేలా.. భారతీయులు, నేపాలీల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్న ఓలీ వ్యాఖ్యల పట్ల బీజేపీ మండిపడింది. చైనాకు పూర్తిగా లొంగిపోయిన నేపాల్ ప్రధాని డ్రాగన్ చెప్పినట్టుగా ఆడుతున్నారనే భావన వ్యక్తం అవుతోంది. మరీ ఈ స్థాయికి దిగజారి ప్రజల సెంటిమెంట్‌ను దెబ్బ తీసేలా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అవసరమా అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.


By July 14, 2020 at 09:33AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/lord-ram-is-not-indian-he-is-nepal-nepal-pm-kp-controversial-comments/articleshow/76952137.cms

No comments