బీజేపీ నేత ఇంటిపై దాడి.. జిల్లా అధ్యక్షుడి సహా ముగ్గుర్ని హత్యచేసిన ఉగ్రవాదులు
జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. బుధవారం రాత్రి బీజేపీ నేత ఇంటిపై దాడిచేసి ముగ్గుర్ని కాల్చి చంపారు. ఈ ఘటనలో బీజేపీ నేత వసీం బారి (38), తండ్రి షేక్ బషీర్ అహ్మద్ (62), సోదరుడు ఉమర్ షేక్ (30) చనిపోయారు. ఉత్తర కశ్మీర్‌లోని బందీపొర జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా వసీం కొనసాగుతున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి ఓ సీనియర్ రాజకీయ నేతను ఉగ్రవాదులు హత్యచేయడం ఇదే తొలిసారి. పోలీస్ స్టేషన్‌కు 30 మీటర్ల దూరంలోనే ఈ ఘటన జరిగింది. అంతేకాదు, ఘటన చోటుచేసుకున్న ప్రాంతం ఎస్పీ, డిప్యూటీ కమిషనర్ నివాసాలకు 600 మీటర్ల దూరంలో ఉండటం గమనార్హం. వసీం ఇంట్లోకి చొరబడిన ఉగ్రవాదులు.. విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ముగ్గురి తలల్లోకి బుల్లెట్లు దూసుకెళ్లగా.. శరీరంలోని ఇతర భాగాలకు కూడా బుల్లెట్ గాయాలయ్యాయి. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించినట్టు బందిపొర సీనియర్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. ఇదిలా ఉండగా.. వీరి కుటుంబానికి ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉండటంతో ఎనిమిది మంది పోలీసులను భద్రత కోసం నియమించినా.. ఘటన జరిగే సమయానికి ఒక్కరూ అక్కడ లేకపోవడం అనేక అనుమానాలకు తావుస్తోంది. బుధవారం రాత్రి 8.30 ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎనిమిది మంది సెక్యూరిటీ ఉన్నా ఒక్కళ్లూ ఘటన జరిగే సమయానికి లేకపోవడంపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. వీరిపై అనుమానం వ్యక్తం చేస్తూ, ఘటనా స్థలిలో లేకపోవడానికి కారణాలను అన్వేషిస్తున్నారు. భద్రతా విధులు నిర్వర్తిస్తున్న ఎనిమిది మంది పోలీసులలో ఎవరూ ఎందుకు లేరని ఆరా తీస్తున్నాం. తదుపరి చర్యల గురించి బందిపోరా పోలీసులతో చర్చిస్తున్నాం’ అని ఓ సీనియర్ పోలీస్ అధికారి అన్నారు. బీజేపీ సభ్యత్వ నమోదులో చురుకుగా వ్యవహరించిన బారి.. ఈ ప్రాంతంలో కేంద్ర మంత్రులు, పార్టీ అగ్ర నాయకుల పర్యటనకు ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంటారు. వసీం బారి హత్యోదంతంపై ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ ద్వారా ఆరా తీశారు. వసీమ్ కుటుంబానికి తన సంతాపం తెలిపినట్టు ప్రధాన మంత్రి కార్యాలయం వైద్యుడు జితేంద్ర సింగ్ అన్నారు.
By July 09, 2020 at 07:17AM
No comments