Breaking News

పాంగాంగ్ నుంచి చైనా వెనక్కి.. వచ్చే వారం ఇరుదేశాల మధ్య మరోసారి చర్చలు


తూర్పు లడఖ్‌లోని సరిహద్దుల వెంబడి వివాదాస్పద ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ కొనసాగుతోంది. తాజాగా, వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న పాంగాంగ్ సరస్సు నుంచి చైనా తన సైన్యాలను వెనక్కు మళ్లిస్తోంది. ఇప్పటికే గాల్వాన్ లోయ, హాట్‌స్ప్రింగ్ ప్రాంతాల నుంచి పూర్తిగా బలగాలను ఉపసంహరించి, బఫర్ జోన్‌ను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. దశల వారీగా బలగాలను ఉపసంహరించి, యథాపూర్వక స్థితికి తీసుకొచ్చేందుకు వచ్చే వారం మరోసారి ఇరు దేశాల సైనికాధికారుల మధ్య సమావేశం జరుగనుంది. ఈ నేపథ్యంలో పాంగాంగ్ సరస్సు నుంచి సీపీఎల్ఏ దళాల ఉపసంహరణ వేగవంతంగా సాగుతోంది. జూన్ 30న జరిగిన భారత్, చైనా లెఫ్టినెంట్ జనరల్స్ స్థాయి చర్చల్లో పాంగాంగ్ సరస్సు ఉత్తర తీరంలోని ఫింగర్ 4 తూర్పు నుంచి ఫింగర్ 5 పర్వత పాదాల వరకు బలగాలు, వాహనాలను వెనక్కు మళ్లించాలనే అంగీకారానికి వచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు గురువారం వెల్లడించాయి. ఇందులో భాగంగా ఫింగర్ 4 నుంచి 800 మీటర్ల మేర పీఎల్ఏ తన సైన్యాలను ఖాళీచేయడంతో మొదటి దశ ఉపసంహరణ సానుకూలంగా పూర్తయినట్టేనని వ్యాఖ్యానించాయి. కానీ, ఫింగర్ 5-8 వరకు గల ప్రాంతాల్లో సీపీఎల్ఏ ఇంకా వెనక్కు వెళ్లలేదు. ఫింగర్-8 వద్ద వాస్తవాధీన రేఖ ఉత్తర నుంచి దక్షిణంవైపు వెళ్తుందని భారత్ వాదిస్తోంది. ‘ఫేజ్-1లో అంగీకరించినట్టు ఫింగర్-4 వద్ద ఎత్తైన ప్రాంతం నుంచి చైనా దళాలు ఒకవేళ వెనక్కు మళ్లితే పిల్ బాక్సులు వంటి రక్షణ నిర్మాణల విషయంలో మరో మూడు నాలుగు రోజులు వేచిచూస్తాం.. వచ్చే వారం కార్ప్స్ కమాండర్ల సమావేశంలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది’ అని వ్యాఖ్యానించాయి. ఇప్పటికే భారత సైనికులు కూడా ఘర్షణ ప్రాంతాల నుంచి వెనక్కు తగ్గారు. ప్రత్యర్థి దళాలతో ఘర్షణ అవకాశాలను తగ్గించడానికి కుదిరిన అవగాహన ప్రకారం భారత సైనికులు ఫింగర్ -2, 3 మధ్య ధన్ సింగ్ థాపా పోస్ట్ వైపు పశ్చిమానికి వీలైనంత వెనక్కి మళ్లాయి. గత ఐదు రోజులుగా గాల్వాన్ లోయలోని పెట్రోలింగ్ పాయింట్-14, 15,పీపీ17ఏలోని గోగ్రా హాట్-స్ప్రింగ్ ప్రాంతం నుంచి భారత్, చైనా సైన్యాలు 1.5 నుంచి 2 కిలోమీటర్ల మేర వెనక్కు తగ్గాయి. కానీ చాంగ్లా పాస్ మీదుగా 13,900 అడుగుల ఎత్తులో ఉన్న ఉప్పునీటి సరస్సు పాంగాంగ్ వద్ద దళాల ఘర్షణ చాలా అవాంఛనీయమైనదిగా అనిపించింది. మే ఆరంభం నుంచి 3,000 మంది చైనా సైనికులు ఫింగర్ -4 నుంచి 8 వరకు 8 కిలోమీటర్ల విస్తీర్ణాన్ని ఆక్రమించాయి. పెద్ద సంఖ్యలో నిర్మాణాలతో పాటు రిడ్జ్-లైన్లను ఆక్రమించాయి. ‘నాలుగో దఫా చర్చల్లో (జూన్ 6, 22, 30 తరువాత) ఘర్షణకు కేంద్ర స్థానంగా ఉన్న పరిసరాల నుంచి భారీగా ఆయుధాలను ఉపసంహరించుకోవడం వంటి తదుపరి అంశాల విస్తరణపై కూడా దృష్టి పెడతాయి’ అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.


By July 10, 2020 at 08:28AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/border-standoff-pla-begins-pangong-pullback-ahead-of-army-talks-next-week/articleshow/76885076.cms

No comments