Breaking News

మహమ్మారిని కట్టడి చేయగలమని ధారవీ నిరూపించింది.. డబ్ల్యూహెచ్ఓ ప్రశంసల జల్లు


ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా గుర్తింపు పొందిన ముంబైలోని ధారావిలో కరోనా వైరస్‌ను కట్టడి చేసిన తీరుపై (డబ్ల్యూహెచ్ఓ) ప్రశంసలు కురిపించింది. వైరస్ ఎంతగా చెలరేగిపోయినా అడ్డుకట్ట వేయగలమని ధారావి నిరూపించిందని కొనియాడింది. వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు చేసిన ప్రయత్నాల కారణంగా నేడు కరోనా మహమ్మారి బారి నుంచి ధారావి బయటపడిందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధ్నామ్ ఘ్యాబ్రియోసిస్ కితాబిచ్చారు. వైరస్ ఎంతగా వ్యాప్తి చెందినప్పటికీ నియంత్రించగలమని ఇటలీ, స్పెయిన్, దక్షిణ కొరియా, ధారావి నిరూపించాయని ఆయన అన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు ముమ్మరం చేయడం, భౌతిక దూరం పాటించడం, వైరస్ నిర్ధారణ అయినవారికి తక్షణ చికిత్స అందించడం కారణంగా కరోనాతో జరిగిన యుద్ధంలో ధారావి విజయం సాధించిందని అధ్నామ్ కితాబిచ్చారు. లాక్‌డౌన్ సడలింపుల తర్వాత పెరుగుతున్న కేసులను ప్రజల భాగస్వామ్యంతో అడ్డుకోవచ్చని సూచించారు. ధారావిలో ప్రస్తుతం 166 కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నట్టు బీఎంసీ అధికారులు తెలిపారు. దేశంలో కరోనా వైరస్ కేసులు గణనీయంగా పెరుగుతుండగా.. రికవరీ రేటు మాత్రం మిగతా దేశాల కంటే ఎక్కువగా ఉండటం సానుకూలంశం. శుక్రవారం నాటికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8 లక్షలు దాటింది. అయితే, దేశంలోని పలు కీలక ప్రాంతాల్లో మహమ్మారిని నిలువరించారు. ముఖ్యంగా ధారవీ లాంటి అధిక జనసాంద్రత కలిగిన మురికివాడలో మహమ్మారిని కట్టడి చేయడం అంత సులభం కాదు. ఇక్కడ 10 లక్షల మంది జనాభా ఉండగా.. కరోనా విజృంభించకుండా మహారాష్ట్ర ప్రభుత్వం సరైన ప్రణాళికలతో ముందుకు సాగింది. ‘నేడు ప్రపంచంలో 12 మిలియన్ల కేసులు నమోదయ్యాయి. గత ఆరు వారాల్లో కేసులు రెట్టింపు అయ్యాయి. (కానీ) వ్యాప్తి చాలా తీవ్రంగా ఉన్నప్పటికీ, దానిని తిరిగి నియంత్రణలోకి తీసుకురాగలమని ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలు ఉదాహరణగా నిలిచాయి. ఇందులో ఇటలీ, స్పెయిన్, దక్షిణ కొరియా, భారత్‌లోని ధారావి కూడా ఉన్నాయి.. ముంబై మహానగరం అధిక జనాభా కలిగిన ప్రాంతం.. అలాంటి చోట అనారోగ్యంతో ఉన్న వారందరినీ పరీక్షించడం, గుర్తించడం, వేరుచేయడం, చికిత్స చేయడం వంటి ప్రాథమిక అంశాలు.. వైరస్‌ను విచ్ఛిన్నం చేయడం, అణచివేయడానికి కీలకం’ అని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ కితాబిచ్చారు. ముంబైలో కరోనా కట్టడికి ముఖ్యంగా ధారవీలో తీసుకున్న చర్యలను డబ్ల్యూహెచ్ఓ ప్రశంసించడంపై మహారాష్ట్ర మంత్రి, శివసేన యువనేత ఆదిత్య ఠాక్రే సంతోషం వ్యక్తం చేశారు. ‘వైరస్‌ను వెంబడించిన మా ధారవీకి ఇది ఎంతో గొప్ప విజయం. రాష్ట్ర ప్రభుత్వం, బీఎంసీ బృందాలు, ఎన్జిఓలతో పాటు, ప్రజా ప్రతినిధులు, ముఖ్యంగా, ధారవీ ప్రజలు ప్రయత్నాలను గుర్తించినందుకు డబ్ల్యూహెచ్ఓకి ధన్యవాదాలు.. ఇది ఇలాగే కొనసాగిద్దాం..కొనసాగుతూనే ఉంటుంది’ ట్వీట్ చేశారు.


By July 11, 2020 at 09:05AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/who-chief-praises-dharavis-efforts-to-contain-outbreak/articleshow/76903979.cms

No comments