Breaking News

వికాస్ దూబే: తుపాకులతోనే సావాసం.. చివరకు దానిచేతిలోనే హతం


లెక్కకు మిక్కిలి నేరాలు, దోపిడీలు, హత్యలతో ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులకు కొరకరాని కొయ్యగా తయారైన గ్యాంగస్టర్ కథ ముగిసింది. తుపాకులతో సావాసం చేసిన గ్యాంగస్టర్ చివరకు దాని చేతిలోనే హతమయ్యాడు. శుక్రవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో దూబేను పోలీసులు కాల్చి చంపారు. బలవంతపు వసూళ్లు, హత్యలు సహా 60 కేసుల్లో నిందితుడిగా ఉన్న వికాస్ దూబే పేరు గతవారం బిక్రూ గ్రామంలో ఎనిమిది మంది పోలీసులను హత్యచేసిన ఘటనతో దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఈ ఘటన తర్వాత తప్పించుకున్న వికాస్ దూబే కోసం పోలీసులు జల్లెడపట్టగా.. గురువారం ఉదయం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వరం ఆలయం వద్ద చిక్కాడు. దీంతో అతడిని ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు తరలిస్తుండగా.. దాదాపు 700 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వుండగా, 690 కిలోమీటర్ల దూరం సజావుగానే సాగింది. ఆపై కాన్పూర్ శివార్లలోకి వాహనం ప్రవేశించగానే అనూహ్య పరిణామాలు చోటుచేసుకుని, గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌కు కారణమయ్యాయి. ఘటనా స్థలిలో జరిగిన విషయాన్ని ఓ పోలీసు అధికారి స్వయంగా వెల్లడించారు. గురువారం సాయంత్రం ఉజ్జయిని నుంచి వికాస్ దూబేను తీసుకుని యూపీలోని కాన్పూర్‌కు పోలీసులు బయలుదేరారు. మార్గమధ్యంలో కొంతసేపు ఆగి విశ్రాంతి తీసుకున్నారు.. వికాస్ దూబేను కాన్పూర్‌కు తీసుకుని వస్తున్న విషయం అతడి అనుచరులకు తెలిసిందేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేసిన సదరు అధికారి, కాన్పూర్‌కు 40 కిలోమీటర్ల దూరంలోకి తమ కాన్వాయ్ రాగానే, కొన్ని అనుమానాస్పద వాహనాలు వెంబడించాయని అన్నారు. అపై కాన్పూర్ శివార్లలోకి వాహనం రాగానే, డ్రైవర్ వెనుక ఉన్న వికాస్ దూబే, తన పక్కనే ఉన్న రమాకాంత్ పచౌరీ అనే కానిస్టేబుల్ నుంచి తుపాకిని లాక్కున్నాడు. డ్రైవర్‌తో పెనుగులాడతుండగా వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఆ వెంటనే వాహనాన్ని దిగిన దూబే, పోలీసులపైకి కాల్పులు జరుపుతూ పరిగెత్తాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతన్ని లొంగిపోవాలని హెచ్చరించినా వినలేదు. దీంతో ఆత్మరక్షణార్థం పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన దూబేను ఆసుపత్రికి తరలించేలోపే అతను మరణించాడు. ఈ విషయాన్ని స్పష్టం చేసిన కాన్పూర్ ఐజీ మోహిత్ అగర్వాల్, జరిగిన ఘటనలో వికాస్ దూబే హతుడయ్యాడని వెల్లడించారు. ఎన్‌కౌంటర్‌పై విచారణ జరుపుతున్నామని, పూర్తి వివరాలు తదుపరి దశలో వెల్లడిస్తామని అన్నారు. కాన్పూర్ లో భారీ వర్షం కురుస్తోందని, ఆ కారణంగా పరిస్థితులను తనకు అనువుగా మార్చుకుని తప్పించుకోవాలని దూబే చూశాడని, కానిస్టేబుల్ నుంచి పిస్టల్ ను లాక్కుని పారిపోతుంటే, పోలీసులే అతన్ని కాల్చారని తెలిపారు.


By July 10, 2020 at 11:44AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/vikas-dubey-encounter-gangster-had-snatched-the-firearm-from-police-personnel-ramakant-pachauri/articleshow/76887652.cms

No comments